వెనిజువెలా శిథిలాల్లోకి ‘బొద్దింక డ్రోన్లు’.. సహాయక బృందాల వినూత్న ప్రయత్నం
- శిథిలాల్లో కాక్రోచ్ డ్రోన్ల వినియోగం
- ఇరుకైన ప్రదేశాల్లో బాధితుల గుర్తింపు
- థర్మల్ కెమెరాలతో బాధితుల అన్వేషణ
- నిజమైన బొద్దింకలనూ వాడే అవకాశాలపై కొనసాగుతున్న పరిశోధనలు
- సూక్ష్మ చిప్‌లు అమర్చి దిశను నియంత్రిండంపై ప్రయోగాలు
వెనిజువెలాలో ఇటీవల రెండు భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 3,340 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అయినప్పటికీ సహాయక బృందాలు ఆశ వదల్లేదు. ఇటీవలే ఆరు రోజుల పాటు శిథిలాల్లో చిక్కుకున్న చిన్నారిని సజీవంగా బయటకు తీశారు. ఎనిమిది రోజుల తర్వాత ఓ సెక్యూరిటీ గార్డును కాపాడారు.
శిథిలాల మధ్య ఏర్పడిన చిన్న ఖాళీ ప్రదేశాల్లో బాధితులు చిక్కుకుని ఉండే అవకాశం ఉంటుంది. వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు జాగిలాలను, సున్నితమైన శబ్దాలను గుర్తించే పరికరాలు, ప్రత్యేక కెమెరాలతో పాటు ఇప్పుడు సూక్ష్మ డ్రోన్లను కూడా వినియోగిస్తున్నాయి.
ఈ డ్రోన్లు సుమారు 20 సెంటీమీటర్ల పరిమాణంలో ఉంటాయి. ఇరుకైన మార్గాల్లో సులభంగా ప్రయాణిస్తాయి. వీటిలో థర్మల్ కెమెరాలు ఉండటంతో చీకట్లో కూడా శరీర ఉష్ణోగ్రత ఆధారంగా బాధితులను గుర్తించగలవు. సేకరించిన సమాచారాన్ని వెంటనే సహాయక బృందాలకు పంపిస్తాయి.
ఇక భవిష్యత్తులో నిజమైన బొద్దింకలను కూడా సహాయక చర్యల్లో వినియోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి వీపుపై సూక్ష్మ చిప్‌లు అమర్చి దిశను నియంత్రించే సాంకేతికతపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇటీవల మయన్మార్ భూకంపం సమయంలో ఇలాంటి డ్రోన్లను ప్రయోగాత్మకంగా వినియోగించారు. ప్రత్యక్షంగా ప్రాణాలు కాపాడలేకపోయినా ఇరుకైన ప్రాంతాల్లో ఇవి సమర్థంగా సంచరించగలవని నిరూపితమైంది.