ఐదేళ్లలో 20వేల స్టార్టప్‌లు, లక్ష ఉద్యోగాలు.. కొరియా కంపెనీలకు మంత్రి లోకేశ్ ఆఫర్
- ఐదేళ్లలో 20వేల స్టార్టప్‌లు, లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్న మంత్రి
- రతన్ టాటా హబ్ ద్వారా కొరియన్ స్టార్టప్‌లకు ఏపీకి ఆహ్వానం
- భారత ఏఐ రాజధానిగా ఏపీని తీర్చిదిద్దడమే ధ్యేయమని వెల్లడి
- అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం-ఏఐ విశ్వవిద్యాలయం
- శ్రీసిటీలో విద్యుత్ పరికరాల యూనిట్ పెట్టాలని హ్యోసంగ్‌కు విజ్ఞప్తి
కొరియన్ స్టార్టప్‌లకు రెడ్ కార్పెట్
ఏపీలో ఆవిష్కరణలకు వెన్నెముకగా ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్) గురించి మంత్రి లోకేశ్ కొరియన్ పారిశ్రామికవేత్తలకు వివరించారు. అమరావతిని ప్రధాన కేంద్రంగా చేసుకుని విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం వంటి నగరాల్లో ప్రాంతీయ కేంద్రాలతో ఈ హబ్ పనిచేస్తోందని తెలిపారు. టాటా, ఎల్&టీ, జీఎంఆర్, అదానీ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో దీనిని ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.
ఆలోచనల రూపకల్పన (స్పార్క్), ఇంక్యుబేషన్ (క్యాటలిస్ట్) వంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని కొరియన్ స్టార్టప్‌లను ఆయన ఆహ్వానించారు. ఇప్పటికే ఈ వేదిక ద్వారా 2,500కు పైగా స్టార్టప్‌లకు, 5,200 మందికి పైగా పారిశ్రామికవేత్తలకు మద్దతు అందించినట్లు గుర్తుచేశారు.
ఏపీ ఇన్నోవేషన్ & స్టార్టప్ పాలసీ 2024-29 కింద స్టార్టప్‌లకు అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకాలను లోకేశ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. రూ. 22 కోట్ల ఆర్‌టీఐహెచ్-ఎస్ఐడీబీఐ సీడ్ ఫండ్, రూ. 20 కోట్ల వరకు ఏఐఎఫ్ సీడ్ ఈక్విటీ, వర్కింగ్ క్యాపిటల్ కోసం క్రెడిట్-గ్యారెంటీ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
సిడ్బీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన కొత్త డీప్-టెక్ ఏంజెల్ ఫండ్ ద్వారా ఏఐ, క్వాంటం వంటి అధునాతన రంగాల్లోని స్టార్టప్‌లకు మరింత ఊతమిస్తామని హామీ ఇచ్చారు. ఇండియా-కొరియా మధ్య ఒక ప్రత్యేక స్టార్టప్ కారిడార్ ఏర్పాటుకు కలిసి పనిచేద్దామని, దీని కోసం ఆర్‌టీఐహెచ్‌లో ప్రత్యేకంగా కొరియా డెస్క్, సాఫ్ట్-ల్యాండింగ్ 'విసి బే' ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు.
భారత ఏఐ రాజధానిగా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాజధానిగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ పునరుద్ఘాటించారు. ఈ దిశగా ఇప్పటికే పలు చర్యలు ప్రారంభించామని తెలిపారు. గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు, రిలయన్స్, సిఫీ వంటి సంస్థల ద్వారా 10 గిగావాట్ల డేటా-సెంటర్ పైప్‌లైన్ నిర్మాణం జరుగుతోందని, దీనివల్ల స్టార్టప్‌లకు తక్కువ ధరకే భారీ కంప్యూటింగ్ వనరులు అందుబాటులోకి వస్తాయని వివరించారు.
దేశంలోనే మొట్టమొదటి క్వాంటం & ఏఐ విశ్వవిద్యాలయాన్ని అమరావతి క్వాంటం వ్యాలీలో నెలకొల్పుతున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా 133-క్యూబిట్ సామర్థ్యం గల ఐబీఎం క్వాంటం సిస్టమ్, క్వాంటం హార్డ్‌వేర్ పార్క్ అందుబాటులోకి వస్తాయని, ఇది కొరియన్ డీప్-టెక్ స్టార్టప్‌ల పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు.
హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్‌తో భేటీ
పర్యటనలో భాగంగా హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పోరేషన్ ప్రెసిడెంట్ యోకోటా తకేషితో మంత్రి లోకేశ్ సియోల్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఏపీలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ.8 వేల కోట్ల విలువైన ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ ఉందని, 2034 నాటికి 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
కొవ్వాడలో 7,248 మెగావాట్ల అణు విద్యుత్ ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని, ఈ ప్రాజెక్టులకు భారీ స్థాయిలో 765/800 kV ట్రాన్స్‌ఫార్మర్లు, స్విచ్‌గేర్లు వంటి పరికరాలు అవసరమవుతాయని వివరించారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, తిరుపతి లేదా శ్రీసిటీ సమీపంలో విద్యుత్ పరికరాల తయారీ లేదా అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని హ్యోసంగ్ సంస్థను లోకేశ్ కోరారు. ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని యోకోటా తకేషి హామీ ఇచ్చారు.


