కుప్పంలో సీఎం చంద్రబాబు డబుల్ ఫోకస్
- పేదరిక నిర్మూలనకు పీ4 కార్యక్రమాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు
- బంగారు కుటుంబాలకు అండగా నిలుస్తున్న మార్గదర్శులు, కార్పొరేట్ సంస్థలు
- కుప్పం ఉద్యాన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఐటీసీ సంస్థతో ఒప్పందం
- గంగా-కావేరి నదుల అనుసంధానం జరగాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి
- రైతులు ప్రకృతి సేద్యం వైపు మళ్లాలని, ఆధునిక పద్ధతులు పాటించాలని పిలుపు
పేదరికంపై పీ4 అస్త్రం
పేదల జీవితాలను బంగారు మయం చేయాలనే లక్ష్యంతోనే పీ4 విధానాన్ని అమలు చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన 'బంగారు కుటుంబాల' ఆర్థిక, సామాజిక అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ సమావేశంలో బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న మెగా, అదానీ, టీవీఎస్ మోటార్స్ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. "బంగారు కుటుంబాలు కేవలం ప్రభుత్వ సాయంపై ఆధారపడకూడదు. ఆర్థికంగా ఎదిగి ఇతరులకు సాయం చేసే స్థాయికి చేరుకోవాలి. ఇందుకోసం మార్గదర్శులు, బంగారు మిత్రలు ప్రతి కుటుంబాన్ని అధ్యయనం చేసి, వారి అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలి," అని సీఎం సూచించారు.
సమాజంలోని ఉన్నత వర్గాల్లోని 10 శాతం మంది, పేదరికంలో ఉన్న 20 శాతం కుటుంబాలకు అండగా నిలవాలనే 'ఎంబీకే–10:20' నమూనాతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 12 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించగా, వారికి చేయూతనివ్వడానికి 1.10 లక్షల మంది మార్గదర్శులు ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో 9 వేల బంగారు కుటుంబాల అభివృద్ధి బాధ్యతను అదానీ, టీవీఎస్, మెగా సంస్థలకు అప్పగించినట్లు తెలిపారు.
కుప్పం ఉత్పత్తులకు జాతీయ మార్కెట్
అనంతరం రైతులతో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కాడా), ప్రముఖ సంస్థలైన ఐటీసీ, వీఐఎస్వీలతో ముఖ్యమంత్రి సమక్షంలో కీలక ఒప్పందాలు జరిగాయి. కుప్పంలోని పండ్లు, కూరగాయల క్లస్టర్ల నుంచి ఉత్పత్తులను బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెగాసిటీలకు మార్కెటింగ్ చేసేందుకు ఐటీసీతో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా, 1000 ఎకరాల్లో 10 వేల టన్నుల టమాటాలను పండించి ఎగుమతి చేసేందుకు ఐటీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికోసం రూ.8 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది.
నదుల అనుసంధానం జరగాలి
దేశంలో కరవును శాశ్వతంగా తరిమికొట్టాలంటే నదుల అనుసంధానం జరగాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. "గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రహదారుల తరహాలోనే గంగా-కావేరి, మహానది-కావేరి నదులను అనుసంధానిస్తే దేశంలో నీటి సమస్య తీరుతుంది. హంద్రీనీవా నీటిని కుప్పం ప్రాంతానికి తీసుకొచ్చాం. త్వరలోనే శ్రీశైలం నుంచి తిరుపతిలోని కల్యాణి డ్యామ్ వరకు నీటిని తరలిస్తాం," అని ఆయన హామీ ఇచ్చారు.
రైతులు ఆధునిక పద్ధతులతో పాటు ప్రకృతి సేద్యం వైపు మళ్లాలని సీఎం పిలుపునిచ్చారు. పురుగుమందులు లేని సేద్యంతో పండించిన పంటలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని గుర్తుచేశారు. కుప్పం ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్, పౌల్ట్రీ, డెయిరీ రంగాల్లో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 'పూర్వోదయ స్కీమ్' కింద రాయలసీమకు లక్ష కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.