ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు తమిళ సెగ!

NTR Trivikram movie faces Tamil heat
  • ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై తమిళనాడులో వివాదం
  • మురుగన్ ఉత్తరాదిలో జన్మించాడనడంపై తమిళుల అభ్యంతరం
  • చరిత్రను వక్రీకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని సీమాన్ హెచ్చరిక
  • తమిళనాడులో సినిమాను నిషేధించాలని డిమాండ్
  • వివాదంపై ఇంకా స్పందించని చిత్ర బృందం
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్లకముందే పెను వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కథాంశంపై తమిళనాడు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమిళ జాతీయవాద నేత సీమాన్ ఈ చిత్రాన్ని తమ రాష్ట్రంలో నిషేధించాలని డిమాండ్ చేస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

ఇటీవల చిత్ర నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. "ఉత్తరాదిన పుట్టి, దేశ హృదయంలో రూపుదిద్దుకుని, దక్షిణాదిన పూజలందుకుంటున్నాడు. ఇప్పుడు ఈ కథ విశ్వానికి చెందబోతోంది" అనే వ్యాఖ్యలను దానికి జోడించారు. ఈ సినిమా సుబ్రహ్మణ్య స్వామి (మురుగన్/కార్తికేయుడు) కథ ఆధారంగా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, మురుగన్ ఉత్తరాదిలో జన్మించాడని చెప్పడాన్ని తమిళులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. మురుగన్‌ను తమ ఆరాధ్య దైవంగా, తమిళ సంస్కృతిలో అంతర్భాగంగా భావించే వారు ఈ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వివాదంపై 'నామ్ తమిళ్ కట్చి' పార్టీ అధినేత సీమాన్ ఘాటుగా స్పందించారు. తమిళుల చరిత్రను వక్రీకరించి, వారిని కించపరిచేలా సినిమా తీస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఎన్టీఆర్, త్రివిక్రమ్ సహా చిత్ర బృందాన్ని హెచ్చరించారు. శాంతిభద్రతల దృష్ట్యా, తమిళుల మనోభావాలను గౌరవించి ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్లను రాష్ట్రంలో నిషేధించాలని ఆయన తమిళనాడు ప్రభుత్వాన్ని, థియేటర్ల యజమానులను కోరారు. "తమిళమే మురుగన్, మురుగనే తమిళం. ఈ రెండూ విడదీయరానివి" అని ఆయన స్పష్టం చేశారు.

జూన్ 29న ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ వివాదం నడుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశకు చేరుకోలేదు. ఈ వివాదంపై చిత్ర బృందం నుంచి ఇంతవరకు ఎవరూ అధికారికంగా స్పందించలేదు.
Junior NTR
Trivikram Srinivas
Seeman
Lord Murugan movie controversy
Naga Vamsi
Tamil Nadu film ban

More Telugu News