అఖిల్ 'లెనిన్'పై నాగార్జున ధీమా.. 'జూలై 10న మనవాడు కొడుతున్నాడు'!
- 'లెనిన్' ప్రీ రిలీజ్ వేడుకలో అఖిల్‌పై నాగార్జున ప్రశంసలు
- ఇది సీమ మట్టి కథ, ఒక మహాభారతం లాంటి సినిమా అన్న నాగ్
- సినిమాలో అఖిల్ కాకుండా లెనిన్ పాత్రే గుర్తుంటుందని ధీమా
- ప్రేక్షక దేవుళ్ల ఆశీస్సులతో జూలై 10న మనవాడు కొడుతున్నాడు అని వ్యాఖ్య
- నిర్మాత నాగవంశీ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారని వెల్లడి
అఖిల్ నటన గురించి నాగార్జున మాట్లాడుతూ, "ఇప్పటివరకు ఎక్కువగా అర్బన్ నేపథ్యం ఉన్న సినిమాలు చేసిన అఖిల్, ఈ సీమ మట్టి కథకు సరిపోతాడా అని మొదట కొంచెం భయపడ్డాను. కానీ సినిమా చూశాక నా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. నేను కాదు, మీరందరూ ఆశ్చర్యపోతారు. సినిమాలో మీకు అఖిల్ కనపడడు, కేవలం లెనిన్ మాత్రమే కనిపిస్తాడు. ఆ పాత్రలో అఖిల్ పూర్తిగా లీనమైపోయాడు. లెనిన్ స్నేహాన్ని, ప్రేమను, పగను ప్రేక్షకులు ప్రేమిస్తారు. ఇంటికి వెళ్లేటప్పుడు లెనిన్‌ను తమతో పాటు తీసుకువెళతారు" అని అన్నారు. ఈ చిత్రాన్ని 'సీమలో జరుగుతున్న మహాభారతం'గా ఆయన అభివర్ణించారు.
సినిమా కథ తనను ఎలా ఆకర్షించిందో వివరిస్తూ, "దర్శకుడు నందు మురళీ కిశోర్ అబ్బూరు కథ చెప్పడానికి వచ్చినప్పుడు, ఇది శ్రీరామాపురంలో జరిగే కథ అని చెప్పారు. శ్రీరామాపురం మా నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) పుట్టిన ఊరు కావడంతో నాకు వెంటనే ఒక సెంటిమెంట్ కలిగింది. ఆ ఆసక్తితో కథ విన్నాను. కథలో ఎన్నో మలుపులు, రకరకాల పాత్రలు చాలా ఆకట్టుకున్నాయి. ప్రేమకు మించిన భావోద్వేగం లేదు. ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయి, రాజ్యాలు కూలిపోయాయి. 'లెనిన్'లో కూడా అలాంటి ఓ గొప్ప ప్రేమకథ ఉంది" అని నాగార్జున తెలిపారు.
ఈ సందర్భంగా చిత్రబృందాన్ని నాగార్జున ప్రత్యేకంగా అభినందించారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పోషించిన భారతి పాత్ర గురించి మాట్లాడుతూ, "భారతి ఈ సినిమాకు హార్ట్‌బీట్. ఆ అమ్మాయి కోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు, అంత బాగా చేసింది" అని ప్రశంసించారు. అలాగే, నటులు శివాజీ, బ్రహ్మాజీ, సునీల్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. శివాజీ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచే ఎదిగాడని, బ్రహ్మాజీతో 'చైన్' (శివ సినిమా) నుంచి ప్రయాణం సాగుతోందని అన్నారు. అప్పటి నుంచి బ్రహ్మాజీ జెన్ జీ గానే ఉన్నాడంటూ నాగ్ చమత్కరించారు. సునీల్‌తో 'మన్మథుడు', 'మాస్' వంటి ఎన్నో చిత్రాలు చేశామని చెప్పారు.
నిర్మాత నాగవంశీపై నాగార్జున ప్రశంసల వర్షం కురిపించారు. "చింటూ అన్నకు మాస్ పల్స్ బాగా తెలుసు. అఖిల్‌కు, నాకు తోడుగా ఉండి, సినిమాకు ఏ లోటూ రాకుండా చూసుకున్నాడు. ఈ సినిమాపై ఆయనకు ఎంత నమ్మకం ఉందంటే, ఆంధ్రప్రదేశ్ మొత్తం తనే స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు" అని వెల్లడించారు. ఈ క్రమంలో, "నేను తన గురించి ఇంత మాట్లాడాను, అతను నా గురించి ఏమీ మాట్లాడలేదే" అని నాగ్ సరదాగా వ్యాఖ్యానించగా, నాగవంశీ స్పందిస్తూ.. "జూలై 10న సినిమా రూపంలో మేమే మీకు గిఫ్ట్ ఇస్తున్నాం సర్, ఆ తర్వాతే మాట్లాడతాను" అని బదులిచ్చారు. చివరగా, తన తండ్రి ఏఎన్నార్ ఎప్పుడూ ప్రేక్షకులనే దేవుళ్లుగా భావించేవారని గుర్తుచేసుకుంటూ, "ఆ ప్రేక్షక దేవుళ్ల సాక్షిగా చెబుతున్నా, జూలై 10న మనవాడు వస్తున్నాడు, కొడుతున్నాడు" అంటూ నాగార్జున తన ప్రసంగాన్ని ముగించారు.