ప్రేమ, ఆస్తి కోసం సరిహద్దు దాటాడు.. పాక్ యువకుడిని మానవత్వంతో వెనక్కి పంపిన భారత సైన్యం

Indian Army sends back Pakistani youth who crossed LoC for love and property on humanitarian grounds
  • సోషల్ మీడియాలో పరిచయమైన యువతి కోసం సరిహద్దు దాటిన యువకుడు
  • పూర్వీకుల ఆస్తిని దక్కించుకోవాలనేది మరో ఉద్దేశం
  • భారత సైన్యానికి చిక్కిన యువకుడిని విచారించిన అధికారులు
  • మానవతా దృక్పథంతో తిరిగి పాకిస్థాన్ సైన్యానికి అప్పగింత
సోషల్ మీడియాలో పరిచయమైన యువతిని కలిసేందుకు, పూర్వీకుల ఆస్తిని దక్కించుకునేందుకు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) దాటి భారత్‌లోకి ప్రవేశించిన పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ (పీఓజేకే) యువకుడిని భారత సైన్యం తిరిగి పాకిస్థాన్‌కు అప్పగించింది. మానవతా దృక్పథంతో వ్యవహరించిన సైన్యం, విచారణ అనంతరం అతడిని సురక్షితంగా వెనక్కి పంపింది.

వివరాల్లోకి వెళితే.. పీవోజేకేకు చెందిన జీషన్ మీర్ (22) అనే యువకుడికి కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా తులవారి గ్రామానికి చెందిన ఇరమ్ బానో అనే యువతితో స్నాప్‌చాట్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొద్దికాలానికే బలమైన బంధంగా మారింది. ఇదే సమయంలో తన పూర్వీకులు ఇరమ్ బానో నివసిస్తున్న గ్రామానికే చెందినవారని జీషన్ తెలుసుకున్నాడు. కుటుంబ ఆర్థిక బాధ్యతలు, జీవనోపాధి కోసం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న జీషన్, తన సమస్యలను బానోతో పంచుకున్నాడు. దీంతో సరిహద్దు దాటి తన గ్రామానికి వచ్చేయమని ఆమె సలహా ఇచ్చింది.

ఇద్దరూ కలిసి ఒక ప్రణాళిక రచించారు. దాని ప్రకారం జీషన్ సరిహద్దు దాటి నేరుగా సైన్యానికి లొంగిపోవాలి. చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించినందుకు విధించే శిక్షను అనుభవించి, విడుదలైన తర్వాత గ్రామంలోని తన పూర్వీకుల ఆస్తిపై చట్టబద్ధంగా హక్కు సంపాదించి అక్కడే స్థిరపడాలి. ఈ ప్రణాళికతో మే 31న సరిహద్దు దాటుతుండగా భారత సైన్యం జీషన్‌ను పట్టుకుంది.

విచారణలో భాగంగా జీషన్ చెప్పిన విషయాలను నిర్ధారించుకోవడానికి అధికారులు ఇరమ్ బానోను పిలిపించారు. జీషన్‌ను ఇక్కడే ఉండనివ్వాలని ఆమె అధికారులను అభ్యర్థించింది. ఈ కథనంపై భద్రతా ఏజెన్సీలు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, దీని వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని నిర్ధారించుకున్నాయి. అనంతరం అతడిని తిరిగి పంపాలని నిర్ణయించాయి.

ఈ క్రమంలో నిన్న‌ మధ్యాహ్నం 12:24 గంటలకు కమాన్ అమన్ సేతు వద్ద జీషన్‌ను పాక్ సైనిక అధికారులకు అప్పగించినట్లు శ్రీనగర్‌కు చెందిన చినార్ కార్ప్స్ ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదికగా తెలిపింది. భారత్‌లో ఉన్నంతకాలం జీషన్‌ను గౌరవంగా, దయతో చూసుకున్నామని, ఇది భారత సైన్యం యొక్క వృత్తిపరమైన నిబద్ధతకు, మానవతా విలువలకు నిదర్శనమని సైన్యం పేర్కొంది.
Zeeshan Mir
Indian Army
Line of Control
Pakistan Occupied Jammu Kashmir
Kaman Aman Sethu
Baramulla Kashmir

More Telugu News