పిల్లల రోగనిరోధక శక్తిని దెబ్బతీసే 5 పేరెంటింగ్ తప్పులు ఇవే!

Childrens Immunity 5 Parenting Mistakes That Damage Kids Health
  • పరిమాణం కంటే పోషకాలే ముఖ్యమంటున్న నిపుణులు
  • ‘హెల్తీ’ లేబుల్స్ అన్నీ నిజం కావని వెల్లడి
  • ఆహారాన్ని శిక్ష, బహుమతిగా మార్చొద్దని సూచన
  • ఇతరులను చూసి డైట్ ప్లాన్ వద్దంటూ హితవు
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. మంచి ఆహారం అందించడం, పరిశుభ్రత పాటించడం, సకాలంలో వ్యాక్సిన్లు వేయించడం వంటివి చేస్తుంటారు. అయితే, ఎంత మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ.. రోజువారీ జీవితంలో ఆరోగ్యకరమైనవని భావించే కొన్ని అలవాట్లు పిల్లల రోగనిరోధక శక్తిని నిశ్శబ్దంగా దెబ్బతీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇమ్యూనిటీ అనేది కేవలం ఏదో ఒక ‘సూపర్ ఫుడ్’ లేదా సప్లిమెంట్ ద్వారా వచ్చేది కాదు. ఇది సమతుల్య ఆహారం, మంచి నిద్ర, క్రమబద్ధమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ (గట్ హెల్త్), మానసిక సమతుల్యత వంటి అనేక అంశాల కలయికతో ఏర్పడుతుంది.

ఆధునిక జీవనశైలి, బిజీ షెడ్యూల్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, స్క్రీన్ టైమ్ పెరగడం, సోషల్ మీడియాలో వచ్చే మితిమీరిన ఆరోగ్య సలహాల వల్ల.. ఏది సరైనదో, ఏది మార్కెటింగ్ ట్రెండో గుర్తించడం తల్లిదండ్రులకు కష్టంగా మారుతోంది. ఈ క్రమంలో యాంటీబ్యాక్టీరియల్ ఉత్పత్తులను ఎక్కువగా వాడటం, మార్కెట్లో లభించే ‘హెల్తీ’ ప్యాకేజ్డ్ స్నాక్స్‌ను నమ్మడం, నిద్ర వేళల్లో క్రమం లేకపోవడం వంటి అలవాట్లు పిల్లల రోగనిరోధక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతున్నాయి. ప్రఖ్యాత ఇంటిగ్రేటివ్ వెల్నెస్ కోచ్, ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్, ‘ఇవాల్వ్ విత్ నీరజ మెహతా’ వ్యవస్థాపకురాలు నీరజ మెహతా.. తల్లిదండ్రులు సాధారణంగా చేసే ఐదు పోషకాహార తప్పులను, వాటికి గల పరిష్కారాలను వివరించారు.

పోషక విలువల కంటే ఆహార పరిమాణానికే ప్రాధాన్యం ఇవ్వడం 
పిల్లలు ప్లేటులో ఉన్నదంతా తినేస్తే తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. కానీ, ఎక్కువగా తినడం, పౌష్టికాహారం తినడం వేర్వేరు విషయాలు. కేవలం కార్బోహైడ్రేట్లు, జంక్ ఫుడ్స్ తినడం వల్ల కడుపు నిండుతుందేమో కానీ, ఎదుగుదలకు అవసరమైన విటమిన్లు అందవు. పిల్లల ఏకాగ్రత, ఇమ్యూనిటీ, శక్తి కోసం ఆహార పరిమాణం కంటే అందులోని ప్రొటీన్లు, ఫ్యాట్లు, ఫైబర్ (పీచుపదార్థం) వంటి పోషకాలు ఎంతో ముఖ్యం.

‘హెల్తీ’ అని బోర్డులు చూసి ఉత్పత్తులను కొనడం 
సూపర్‌మార్కెట్లలో దొరికే ఉత్పత్తులపై ‘హెల్తీ’ అని రాసి ఉన్నంత మాత్రాన అందులో చక్కెర, ప్రిజర్వేటివ్స్, శుద్ధి చేసిన పదార్థాలు లేవని అర్థం కాదు. ఇవి కేవలం మార్కెటింగ్ జిమ్మిక్కులు మాత్రమే. వీటిని నిరంతరం తినిపించడం వల్ల పిల్లల జీవక్రియ దెబ్బతింటుంది. ఇలాంటి ప్యాకేజ్డ్ ఉత్పత్తుల కంటే ఇంట్లో తయారుచేసే సాధారణ, సహజమైన ఆహారమే ఎంతో మేలు చేస్తుంది.

ఆహారాన్ని శిక్షగా లేదా బహుమతిగా ఉపయోగించడం
చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఏదైనా మంచి పని చేస్తే చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు బహుమతిగా ఇవ్వడం.. తప్పు చేస్తే వారికి ఇష్టమైన ఆహారాన్ని దూరం చేయడం చేస్తుంటారు. ఇది చిన్నప్పుడు బాగానే అనిపించినా, భవిష్యత్తులో ఆహారంతో పిల్లలకు మానసిక బంధం ఏర్పడేలా చేస్తుంది. దీనివల్ల వారు ఆకలి కోసం కాకుండా, భావోద్వేగాలకు లోనైనప్పుడు (ఎమోషనల్ ఈటింగ్) తినడం అలవాటు చేసుకుంటారు. పిల్లల్లో సహజమైన ఆకలిపై అవగాహన పెంచడం ముఖ్యం.

గట్ హెల్త్‌ను నిర్లక్ష్యం చేయడం
పిల్లల మొత్తం ఆరోగ్యానికి జీర్ణవ్యవస్థ పనితీరు చాలా కీలకం. గట్ హెల్త్ కేవలం జీర్ణక్రియకే కాకుండా ఇమ్యూనిటీకి, మానసిక స్థితికి కూడా ముడిపడి ఉంటుంది. మితిమీరిన ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెర, యాంటీబయాటిక్స్ వాడకం వల్ల పొట్టలోని మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. దీనివల్ల కడుపునొప్పి, బలహీనమైన ఇమ్యూనిటీ, అలసట, ప్రవర్తనలో మార్పులు వస్తాయి. దీని నివారణకు పీచుపదార్థాలు, సీజనల్ పండ్లు, పులియబెట్టిన ఆహార పదార్థాలను అందించాలి.

అవసరాలను పక్కనపెట్టి ట్రెండీ డైట్లను అనుసరించడం 
ఏ ఇద్దరు పిల్లల శారీరక అవసరాలు ఒకేలా ఉండవు. ఒకరికి సరిపడిన డైట్ మరొకరికి సెట్ అవ్వాలని లేదు. కేవలం సోషల్ మీడియాలో చూసో, లేదా ఇతరులను చూసో డైట్ ప్లాన్లను ఫాలో అవ్వడం తప్పు. పిల్లల జీర్ణక్రియ, శారీరక శ్రమ, మెటబాలిజం, ఆకలిని బట్టి వ్యక్తిగత అవసరాలకు తగినట్లుగా ఆహారాన్ని అందించాలి.

పరిపూర్ణమైన పేరెంటింగ్ కోసం ఆరాటపడుతూ కఠినమైన నియమాలు పెట్టడం కంటే.. పిల్లల్లో స్థిరమైన, ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడమే దీర్ఘకాలంలో వారికి మేలు చేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Childrens Immunity
Neerja Mehta
Parenting Mistakes
Child Nutrition
Gut Health
Healthy Food

More Telugu News