రెండు వికెట్లు పడ్డా భయపడలేదు.. పక్కా ప్లానింగ్‌తోనే భారత్‌ను ఓడించాం: బెథెల్!
- భారత్‌పై ఇంగ్లాండ్ ఘనవిజయం
- 76 పరుగులతో విజయాన్ని అందించిన బెథెల్
- బిష్ణోయ్ ఓవరే ప్రధాన మలుపన్న స్టార్ బ్యాటర్
- భాగస్వామ్యాలతోనే విజయం సాధ్యమైందన్న బ్యాటర్
- గ్రౌండ్ కొలతలపై స్పష్టమైన వ్యూహం ఉందన్న బెథెల్
2026 టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్‌పై అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న బెథెల్.. క్వాలిటీ బౌలింగ్ అటాక్ ఉన్న టీమిండియాపై రాణించడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని చెప్పాడు. "ఆ ప్రపంచకప్ సెమీఫైనల్లో మేము గెలవకపోయినప్పటికీ, ఆ మ్యాచ్‌ను నేను బాగా ఎంజాయ్ చేశాను. భారత్ అత్యంత నైపుణ్యం కలిగిన బౌలింగ్ లైన్అప్. అయితే, నేను వారితో ఆడిన రెండు పిచ్‌లు కూడా బ్యాటింగ్‌కు బాగా సహకరించాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లపై రాణించాలని ఎవరికైనా ఉంటుంది. అందుకే ఈ ప్రదర్శన నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది" అని బెథెల్ పేర్కొన్నాడు.
కూల్ అండ్ కాలిక్యులేటెడ్ చేజ్!
ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి 1/2 పరుగులతో ఇంగ్లాండ్ పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బెథెల్ క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో హ్యారీ బ్రూక్ కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్‌తో ఒత్తిడిని భారత్‌పైకి నెట్టేశాడని, ఆ తర్వాత టామ్ బాంటన్‌తో కలిసి తాము నిర్మించిన భాగస్వామ్యం ఇన్నింగ్స్‌ను నిలబెట్టిందని బెథెల్ వివరించాడు. "లక్ష్య ఛేదనలో ప్రతిసారీ వేగంగా ఆడలేం. భాగస్వామ్యాలు నిర్మిస్తూ సరైన సమయం కోసం వేచి చూడాలి. ఒకటి రెండు భారీ ఓవర్లు పడితే మ్యాచ్ మొత్తం మనవైపు తిరుగుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా సమయానికి తగ్గట్టుగా అంతా సరిగ్గా కుదిరింది" అని అన్నాడు.
బిష్ణోయ్ ఓవర్ సృష్టించిన ప్రకంపనలు!
మ్యాచ్‌ను పూర్తిగా ఇంగ్లాండ్ వైపు తిప్పిన మలుపు 17వ ఓవర్లోనే వచ్చింది. భారత లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేసిన ఆ ఓవర్లో రెండు నో బాల్స్, ఫ్రీ హిట్ల సాయంతో ఇంగ్లాండ్ ఏకంగా 29 పరుగులు రాబట్టింది. దీనిపై బెథెల్ మాట్లాడుతూ.. "నిజం చెప్పాలంటే, గాలి వీస్తున్న దిశను బట్టి, బౌండరీ చిన్నగా ఉన్న లెగ్ సైడ్ వైపు నుంచే ఎక్కువ పరుగులు రాబట్టాలని నేను అనుకున్నాను. కానీ, వరుసగా ఫ్రీ హిట్లు రావడం, బౌలర్ ఒత్తిడిలో పడటంతో ఆ వైపు నుంచే భారీగా స్కోర్ చేయడానికి ప్రయత్నించాను. ఆ ప్లాన్ బాగా వర్కవుట్ అయింది. చివర్లో జోఫ్రా ఆర్చర్ వచ్చి మ్యాచ్‌ను ముగించాడు" అని చెప్పాడు.
మైదానంలో ఒకవైపు బౌండరీ లైన్ చిన్నగా, మరోవైపు పెద్దగా ఉన్నప్పటికీ.. తాము కేవలం చిన్న బౌండరీ వైపే సిక్సర్లు కొట్టాలని ఫిక్స్ అవ్వలేదన్నాడు. పెద్ద బౌండరీ వైపు ఉన్న గ్యాప్స్‌ను వాడుకుంటూ బౌండరీలు సాధించడం ద్వారా కూడా అంతే స్కోరు చేయవచ్చని, ఒక బ్యాటింగ్ యూనిట్‌గా తాము ఆ విషయంలో ఎంతో స్మార్ట్‌గా వ్యవహరించామని బెథెల్ ముగించాడు.