ఆ ఒక్క ఓవర్ మమ్మల్ని వెంటాడింది.. భారత్ ఓటమిపై శ్రేయస్ అయ్యర్ ఆవేదన!
- ఇంగ్లాండ్ చేతిలో భారత్ పరాజయం
- 17వ ఓవర్ తమ కొంప ముంచిందని వ్యాఖ్య
- భారీగా పరుగులు సమర్పించుకున్న రవి బిష్ణోయ్‌కు అయ్యర్ మద్దతు
- బెథెల్ ఇన్నింగ్స్‌పై ప్రశంసలు
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే, మొదటి ఓవర్ ముగిసేసరికి 2 పరుగులకే ఒక వికెట్ తీసి, మిడిల్ ఓవర్లలోనూ ఒత్తిడిని కొనసాగించడం ద్వారా మ్యాచ్‌పై భారత్ పూర్తి నియంత్రణలో ఉన్నట్లు కనిపించింది. అయితే బెథెల్ ఆడిన 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్, అలాగే మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసిన 17వ ఓవర్ (ఇందులో 29 పరుగులు వచ్చాయి) ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చాయి. "మ్యాచ్ ఎక్కడ చేజారిందో మనందరికీ తెలుసు, కానీ నేను ఏ ఒక్కరినీ వేలెత్తి చూపించాలనుకోవట్లేదు. మొదటి నో బాల్ పడిన తర్వాత అతడు (రవి బిష్ణోయ్) బలంగా పుంజుకుంటాడని అనుకున్నాను. కానీ 17వ ఓవర్ మమ్మల్ని తీవ్రంగా వెంటాడింది. అయినా దీని నుంచి అతడు పాఠాలు నేర్చుకుంటాడు" అని అయ్యర్ పేర్కొన్నాడు.
బెథెల్ భయం లేని బ్యాటింగ్!
అసాధారణ బౌన్స్ ఉన్న ఈ పిచ్‌పై తాము సాధించిన స్కోరు అద్భుతమైనదని కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. మొదటి 15 ఓవర్ల వరకు మ్యాచ్‌పై తమదే ఆధిపత్యమని, అయితే జాకబ్ ఆడిన తీరుకు క్రెడిట్ ఇవ్వాల్సిందేనని అన్నాడు. ఇన్నింగ్స్ ముగింపు దశలో స్పిన్నర్లపై బెథెల్ చేసిన వ్యూహాత్మక దాడి ఇంగ్లాండ్‌కు అనుకూలంగా మారింది. గ్రౌండ్ కొలతలను, వికెట్ స్వభావాన్ని ఇంగ్లాండ్ ముందే అంచనా వేసిందని అయ్యర్ చెప్పాడు. అలాగే భారత ఇన్నింగ్స్ సమయంలో ఇంగ్లాండ్ బౌలర్ శామ్ కరన్ లైన్ అండ్ లెంగ్త్‌ను, ఆఫ్ స్టంప్‌కు వెలుపల బౌలింగ్ చేయాలనే వారి వ్యూహాన్ని అయ్యర్ అభినందించాడు.
యువ ఆటగాడు బెథెల్ భయం లేని మనస్తత్వాన్ని అయ్యర్ ప్రత్యేకంగా కొనియాడాడు. "అతడికి ఎటువంటి బెరుకు లేని నైజం ఉంది. నెట్స్‌లో అతడు బ్యాటింగ్ చేసే విధానం చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మైదానంలో అతడు కంగారు పడతాడని నేను అనుకోలేదు" అని వ్యాఖ్యానించాడు. ఈ పరాజయం నిరాశపరిచినప్పటికీ, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం సానుకూలంగానే ఉంటుందని, ఈ ఓటమిని పట్టుకుని కూర్చోబోమన్నాడు. " నేను ఎల్లప్పుడూ ఉత్సాహంగానే ఉంటాను. ఈ వైఫల్యం నుంచి మేం బయటపడతాం. మరింత బలంగా పుంజుకుంటాం’’ అని ధీమా వ్యక్తంచేశాడు.