కేతన్ అగర్వాల్ కుటుంబంలో మరో విషాదం.. మనవడి మరణం తట్టుకోలేక తాత కన్నుమూత!

Ketan Agarwal family tragedy Grandfather dies unable to bear grandsons death
  • కేతన్ తాత దేవీచంద్ అగర్వాల్ అనారోగ్యంతో కన్నుమూత
  • మనవడి మరణంతో మానసికంగా కుంగిపోయి ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం
  • 'మిస్ యూ డాడ్' అంటూ సోషల్ మీడియాలో కేతన్ తండ్రి భావోద్వేగ పోస్ట్
పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యోదంతంతో తీవ్ర విషాదంలో ఉన్న ఆయన కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కేతన్ తాత (తండ్రికి తండ్రి) దేవీచంద్ అగర్వాల్ అనారోగ్యంతో కన్నుమూశారు. పూణెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. తన తండ్రిని కోల్పోయిన విషయాన్ని తెలియజేస్తూ కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్, సోషల్ మీడియాలో ‘మిస్ యూ డాడ్’ అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు.

కుటుంబ వర్గాల సమాచారం ప్రకారం, దేవీచంద్‌కు కొంతకాలం క్రితమే మేజర్ హార్ట్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ తరుణంలో అత్యంత పాశవికంగా జరిగిన మనవడు కేతన్ హత్య ఆయనను మానసికంగా తీవ్రంగా కుంగదీసింది. ఈ ఘటన తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది.

కొద్ది రోజుల క్రితం ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ అమర్చి చికిత్స అందించారు. అయినప్పటికీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూ దేవీచంద్ కన్నుమూశారు.

కాగా, కొద్ది వారాల క్రితం పూణెలోని లోహగడ్ కోట వద్ద లోయలోకి తోసి కేతన్ అగర్వాల్ (26)ను హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేతన్ కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) నిందితులుగా ఉన్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు వెలికితీసిన వివరాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. కేతన్‌ను ఎలా చంపాలనే దానిపై నిందితులు గూగుల్, యూట్యూబ్‌లలో వెతికారని, చివరికి కోట పైనుంచి తోసేయడమే సులభమైన మార్గమని నిర్ధారణకు వచ్చారని తేలింది. కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అయితే పెళ్లిని రద్దు చేసుకుంటే కుటుంబ పరువు పోతుందని భావించిన సియా, ఈ దారుణానికి కుట్ర పన్నినట్లు దర్యాప్తులో అంగీకరించింది. 
Ketan Agarwal
Devichand Agarwal
Pune businessman murder
Siya Goyal
Lohagad Fort case
Vishal Agarwal

More Telugu News