పాపం.. దుర్వాసన వస్తోందని జిమ్ నుంచి వెళ్లగొట్టారు!
- చైనాలోని హాంగ్‌జౌలో ఘటన
- షీ అనే వ్యక్తికి చెమట పట్టి వచ్చిన దుర్వాసన
- తోటి సభ్యులు పదే పదే ఫిర్యాదు చేయడంతో జిమ్ యాజమాన్యం చర్యలు
- అతడు వాడిన పరికరాలు వాడడానికీ వెనకాడిన వైనం
- ఓ మూలకు చేసుకోవాలని సూచించినా ఫలితం శూన్యం
హాంగ్‌జౌకు చెందిన షీ అనే వ్యక్తి 2025లో మూడేళ్లకు జిమ్ సభ్యత్వం తీసుకున్నాడు. అయితే ఈ ఏడాది జూన్ 20న అతడి సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. మిగిలిన కాలానికి సంబంధించిన ఫీజును తిరిగి చెల్లించింది.
జిమ్‌లో వ్యాయామం చేసే సమయంలో షీకి ఎక్కువగా చెమట పట్టడంతో పాటు తీవ్రమైన దుర్వాసన వస్తోందని సభ్యులు పదేపదే ఫిర్యాదు చేసినట్లు యాజమాన్యం వెల్లడించింది. కొందరు అతను ఉపయోగించిన పరికరాలను వాడేందుకు కూడా వెనుకాడినట్లు తెలిపింది.
ఫిర్యాదుల తాకిడి తగ్గేందుకు అతణ్ని ఓ మూల ఉన్న పరికరాలు ఉపయోగించాలని సూచించామని యాజమాన్యం తెలిపింది. రద్దీ లేని సమయాల్లో రావాలని తెలిపినట్లు పేర్కొంది. అప్పటికీ ఫిర్యాదులు వస్తుండడడంతో చివరికి సభ్యత్వాన్ని రద్దు చేయక తప్పలేదని వివరించింది.
అయితే షీ మాత్రం తాను ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నానని చెప్పాడు. వ్యాయామం సమయంలో పలుసార్లు తువాళ్లతో చెమట తుడుచుకునేవాడ్నని, పరికరాలపై కూడా తువాళ్లు పరచేవాడ్నని తెలిపాడు. ఇంటికి సమీపంలో జిమ్ ఉండటంతో అక్కడే కొనసాగాలని భావించినా, చివరకు సభ్యత్వం కోల్పోయాడు.