సౌదీలో తెలంగాణ కార్మికుడి కన్నీటి గాథ.. 12 ఏళ్ల తర్వాత విగతజీవిగా హైదరాబాద్‌కు..!
- సౌదీలో 12 ఏళ్లుగా చిక్కుకున్న తెలంగాణ వాసి మృతి
- గుండెపోటుతో కన్నుమూసిన రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి దాసు
- స్వచ్ఛంద సంస్థల కృషితో హైదరాబాద్‌కు చేరిన మృతదేహం
- సరైన పత్రాలు లేకపోవడంతో స్వదేశానికి రాలేకపోయిన దాసు
కోనరావుపేట గ్రామానికి చెందిన దాసు, సరైన నివాస అనుమతి పత్రాలు, పాస్‌పోర్ట్ లేకపోవడంతో గత పన్నెండేళ్లుగా స్వదేశానికి తిరిగి రాలేకపోయాడు. రియాద్‌లోనే ఉంటూ చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతడికి భార్య, చదువుకుంటున్న కుమార్తె, కుమారుడు ఉన్నారు.
దాసు మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు సౌదీలోని భారత రాయబార కార్యాలయం, గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ కమిటీ, సాటా ఈస్టర్న్ వంటి సంస్థలు సహకరించాయి. మహమ్మద్ ఫారూఖ్, అబ్దుల్ రఫిక్, రంజిత్, ముజమ్మిల్ వంటి సామాజిక కార్యకర్తలు ప్రత్యేక చొరవ తీసుకుని, అవసరమైన పత్రాలను సిద్ధం చేయించారు. ఎలైట్ ఫ్రైట్ ఫార్వార్డింగ్ సంస్థ ద్వారా మృతదేహాన్ని హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు.