50 శాతం పట్టభద్రుల్లో నైపుణ్యాలు శూన్యం: శ్రీసిటీ వర్సిటీ ప్రారంభోత్సవంలో శ్రీనిరాజు
- తిరుపతి జిల్లా శ్రీసిటీలో అంతర్జాతీయ యూనివర్సిటీ ప్రారంభం
- యువతలో నైపుణ్యాల అంతరాన్ని పూడ్చడమే తమ లక్ష్యమన్న చైర్మన్ శ్రీనిరాజు
- సీఎం చంద్రబాబు నిర్దేశం మేరకే గ్యారంటీ ఉపాధి లక్ష్యంగా వర్సిటీ ఏర్పాటు
- విదేశీ వర్సిటీల తరహాలో వర్క్ స్టడీ మోడల్‌ను అమలు చేస్తున్నట్లు వెల్లడి
పట్టభద్రుల్లో 95 శాతం మంది సరైన మార్గనిర్దేశం, సహకారం కోరుకుంటున్నారని శ్రీనిరాజు తెలిపారు. ఈ నైపుణ్యాల అంతరాన్ని (స్కిల్ గ్యాప్) పూడ్చేందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో శ్రీసిటీ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. "ముఖ్యమంత్రి చంద్రబాబు గ్యారంటీ ఉపాధి కల్పించాలని మాకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగానే సింగపూర్, కెనడా, జర్మనీ వంటి దేశాల్లో అమలవుతున్న వర్క్-స్టడీ మోడల్‌లో ఈ వర్సిటీని తీర్చిదిద్దాం" అని వివరించారు. వర్సిటీలో ఇంక్యుబేషన్, ఇన్నొవేషన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రవీణ్ అక్కిరాజు తదితరులు పాల్గొన్నారు. కార్నెగి మెలాన్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ రాజారెడ్డి, కేంద్ర మాజీ వాణిజ్య కార్యదర్శి జీకే పిళ్లై పంపిన సందేశాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు.