తండ్రి అంత్యక్రియలకు మొజ్తబా ఖమేనీ దూరం.. కారణమిదే!
- తండ్రి అలీ ఖమేనీ అంత్యక్రియలకు దూరంగా ఉండనున్న ఇరాన్ కొత్త అధినేత మొజ్తబా
- తీవ్ర భద్రతా ముప్పు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార ప్రతినిధి వెల్లడి
- మొజ్తబా బయటకు రావాలనుకుంటున్నా భద్రతా దళాలు అనుమతించడం లేదని వ్యాఖ్య
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను జులై మొదటి వారం నుంచి భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇరాన్ చరిత్రలోనే అతిపెద్ద కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచిపోయే ఈ అంత్యక్రియలకు లక్షలాది మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, భారత్‌లోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అయతొల్లా హకీం ఇలాహీ కీలక విషయాలను వెల్లడించారు. "మొజ్తబా స్వయంగా ప్రజల వద్దకు రావాలని, వారిని కలవాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతా దళాలు అందుకు అనుమతించడం లేదు. ఆయనకు రక్షణ కల్పించడం అత్యంత ప్రమాదకరమని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఈ కారణంతోనే ఆయన అంత్యక్రియలకు కూడా హాజరుకాకపోవచ్చు" అని ఇలాహీ తెలిపారు.