కమీషన్ల రాజ్యానికి 'టీవీకే' సర్కార్ చెక్.. అంచనాల కంటే 36 శాతం తక్కువకే టెండర్లు!
- పారదర్శక టెండర్ విధానంతో తమిళనాడు ప్రభుత్వానికి భారీ పొదుపు
- గతంలో ఉన్న కమిషన్ సంస్కృతి, సిండికేట్ వ్యవహారాలకు స్వస్తి
- అంచనా వ్యయం కంటే 25 శాతం నుండి 36 శాతం తక్కువకు కోట్ చేస్తున్న కాంట్రాక్టర్లు
- రూ. 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్ర ఖజానాకు ఊరట
- నాణ్యత, సకాలంలో పనులు పూర్తి చేయడమే విజయ్ ప్రభుత్వ తదుపరి సవాలు
కొత్త విధానం ప్రకారం.. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ)తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో చిన్న చిన్న పనులకు కూడా బహిరంగ పోటీ టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఈ పారదర్శకత కారణంగా కాంట్రాక్టర్లు ప్రభుత్వ అధికారిక అంచనా వ్యయం కంటే 25 శాతం నుండి 36 శాతం తక్కువ ధరలకే పనులు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఉదాహరణకు.. రూ. 25 లక్షల విలువైన ఒక రోడ్డు పునరుద్ధరణ ప్రాజెక్టును కాంట్రాక్టర్లు కేవలం రూ. 16 నుండి 17 లక్షలకే దక్కించుకుంటున్నారు.
కమిషన్ల సంస్కృతికి చరమగీతం
గతంలో పొలిటికల్ కమీషన్లు, పారదర్శకత లేని టెండర్ ప్రక్రియల వల్ల అధికారిక అంచనాల కంటే 10 శాతం అదనపు ధరలకు కాంట్రాక్టులు కేటాయించేవారని, ప్రస్తుత పద్ధతి ఆ దోపిడీని అడ్డుకుందని కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడే స్వయంగా వెల్లడించారు.
ప్రస్తుతం తమిళనాడు రూ. 10 లక్షల కోట్లకు పైగా అప్పుల భారంతో సతమతమవుతున్న తరుణంలో విజయ్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఖజానాకు పెద్ద ఊరటనిస్తోంది. గత పాలకుల కాలంలో జరిగిన అక్రమాలను, కమీషన్ల సంస్కృతిని తాము పూర్తిగా తుడిచిపెట్టామని రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి ఆధవ్ అర్జున స్పష్టం చేశారు.
తాము అధికారంలోకి వస్తే అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తామని ఎన్నికల సమయంలో విజయ్ ఇచ్చిన హామీని ఈ రూపంలో నెరవేరుస్తుండటంపై తమిళనాట హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇంత తక్కువ ధరలకే టెండర్లు దక్కించుకుంటున్న కాంట్రాక్టర్లు పనుల్లో నాణ్యతను ఏ మేరకు పాటిస్తారనేది 'టీవీకే' ప్రభుత్వానికి మున్ముందు పెద్ద సవాలుగా మారనుంది.