1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్‌.. ఆ తర్వాత జరిగిన ట్విస్ట్‌ ఏంటంటే!

  • ఎంపైర్‌ స్టేట్‌ టవర్‌పైకి ఎక్కిన రష్యన్‌ జంట
  • ప్రపంచ శాంతి సందేశంతో బ్యానర్‌ ప్రదర్శన
  • టవర్‌పైనే యువతికి లవ్‌ ప్రపోజ్‌
  • సాహసం అనంతరం ఇద్దరినీ అరెస్ట్‌ చేసిన పోలీసులు
  • ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు
అమెరికాలోని ప్రముఖ ఎంపైర్‌ స్టేట్‌ భవనంపైకి ఎక్కిన రష్యాకు చెందిన ఓ జంట అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 1,454 అడుగుల ఎత్తులో ఉన్న ట్రాన్స్‌మిషన్‌ టవర్‌ శిఖరానికి చేరుకున్న వారు ప్రపంచ శాంతిని కోరుతూ ఓ బ్యానర్‌ను ప్రదర్శించారు. అనంతరం యువకుడు యువతికి లవ్‌ ప్రపోజ్‌ చేయగా ఆమె అంగీకరించింది. ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకున్నారు. అయితే ఈ సాహసం చివరకు వారి అరెస్ట్‌కు దారితీసింది.

ఏంజెలా నికోలౌ, వాన్యా బీర్కస్‌ అనే ఈ జంట ముఖాలకు మాస్కులు ధరించి టవర్‌పైకి ఎక్కింది. అక్కడి నుంచి తమ సాహసాన్ని సోషల్‌ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అనంతరం టవర్‌ దిగువ ప్లాట్‌ఫామ్‌కు చేరుకున్న తర్వాత వాన్యా మోకాలిపై కూర్చుని ఏంజెలాకు ప్రపోజ్‌ చేశాడు. ఆమె అంగీకరించడంతో ఇద్దరూ తమ ఎంగేజ్‌మెంట్‌ను అక్కడే జరుపుకొన్నారు.

ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు భవనం అబ్జర్వేషన్‌ డెక్‌ను ఖాళీ చేయించారు. పరిసర ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేశారు. అనంతరం ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. టవర్‌పైకి వారు ఎలా చేరుకున్నారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. అనుమతి లేకుండా ఇంత ప్రమాదకరమైన ప్రాంతంలోకి వెళ్లడం తీవ్ర ముప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా ఈ జంట గతంలోనూ ప్రపంచంలోని పలు ఎత్తయిన భవనాలు ఎక్కి వార్తల్లో నిలిచింది.

More Telugu News