హార్దిక్ పాండ్యా ట్రేడింగ్‌పై సీఎస్‌కే క్లారిటీ.. సీఈఓ ఏమన్నారంటే..!

CSK clarity on Hardik Pandya trading what the CEO said
  • ముంబై ఇండియన్స్‌ను వీడనున్నట్లు హార్దిక్ పాండ్యాపై ఊహాగానాలు
  • హార్దిక్‌ను దక్కించుకునే రేసులో చెన్నై, కోల్‌కతా ఉన్నాయంటూ ప్రచారం
  • ట్రేడింగ్ వార్తలను ఖండించిన సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్
  • ఎంఎల్‌సీ తర్వాతే జట్టుపై సమీక్ష ఉంటుందని స్పష్టీకరణ
  • కెప్టెన్సీ మార్పు కోసమే హార్దిక్‌పై సీఎస్‌కే ఆసక్తి చూపుతోందన్న విశ్లేషణలు
ఐపీఎల్ ప్లేయర్ల ట్రేడింగ్ విండోకు సంబంధించి ఊహాగానాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ (ఎంఐ) స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఐపీఎల్ 2026లో ముంబై పేలవ ప్రదర్శన నేపథ్యంలో హార్దిక్‌ను ఆ జట్టు ట్రేడ్ చేయవచ్చని, అతడిని దక్కించుకోవడానికి ఏకంగా ఏడు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నాయని కథనాలు వెలువడ్డాయి. ఈ రేసులో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) ముందున్నాయని ప్రచారం జరిగింది. ఈ వార్తలపై తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందించి స్పష్టతనిచ్చారు.

హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ గురించి తమ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదని కాశీ విశ్వనాథన్ స్ప‌ష్టం చేశారు. 'హిందుస్థాన్ టైమ్స్‌'తో ఆయన మాట్లాడుతూ.. "మేము దీనిపై ఇంకా ఎలాంటి చర్చలు జరపలేదు. మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) ముగిసిన తర్వాతే జట్టుపై పూర్తిస్థాయి సమీక్ష ఉంటుంది. ఆ తర్వాతే ఇలాంటి విషయాలపై ఒక నిర్ణయానికి వస్తాం" అని వివరించారు. అమెరికాలో జరిగే టీ20 లీగ్ అయిన ఎంఎల్‌సీ జులై 18న ముగియనుంది. ఇందులో సీఎస్‌కే అనుబంధ జట్టు టెక్సాస్ సూపర్ కింగ్స్ కూడా ఆడుతోంది.

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఐపీఎల్ 2025లో 10వ స్థానంలో నిలవగా, 2026 సీజన్‌లో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్‌తో పాటు అతని కెప్టెన్సీపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జట్టుకు కొత్త నాయకత్వం అవసరమని, అందుకు హార్దిక్ పాండ్యా సరైన ఎంపిక అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్‌ను సీఎస్‌కే ట్రేడ్ చేసుకున్నందున, ఇప్పుడు కూడా అలాంటి సంచలన నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.  

ఒక ప్రముఖ మీడియా కథనం ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) మినహా మిగిలిన అన్ని ఫ్రాంచైజీలు హార్దిక్‌ను తమ జట్టులోకి తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026లో హార్దిక్ వ్యక్తిగతంగా విఫలమైనప్పటికీ, భారత జట్టులో కీలక ఆల్ రౌండర్‌గా, వైట్ బాల్ క్రికెట్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా అతనికి మంచి డిమాండ్ ఉంది. అందుకే అతని ట్రేడింగ్ విషయం ఇంతగా చర్చనీయాంశంగా మారింది.
Hardik Pandya
Chennai Super Kings
Kasi Viswanathan
Mumbai Indians
IPL Trading Window
IPL 2026

More Telugu News