స్టాక్ మార్కెట్లో బుల్ జోష్.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
- 24,000 మార్కును అధిగమించిన నిఫ్టీ
- 77,000కు చేరువలో సెన్సెక్స్
- ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, రియల్టీ షేర్లలో బలమైన కొనుగోళ్లు
- అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పెరిగిన సెంటిమెంట్
- ఐటీ, మెటల్, ఫార్మా రంగాల్లో బలహీనత
నిఫ్టీ టెక్నికల్ అవుట్‌లుక్‌పై విశ్లేషకులు స్పందిస్తూ.. 24,100–24,200 స్థాయులు తక్షణ నిరోధక జోన్‌గా ఉన్నాయని తెలిపారు. ఈ స్థాయిని అధిగమిస్తే బుల్ జోరు మరింత పెరిగి 24,400 స్థాయికి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో కింది స్థాయిలో 23,900–23,800 జోన్ కీలక మద్దతు ప్రాంతంగా పనిచేస్తుందని వివరించారు. నిఫ్టీ షేర్లలో ఎటర్నల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, నెస్లే ఇండియా టాప్ గెయినర్లుగా నిలిచి సూచీల పెరుగుదలకు దోహదపడ్డాయి.
బ్రాడర్ మార్కెట్ కూడా సానుకూలంగా ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.34%, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.36% మేర లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే.. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా లాభపడగా, ఎఫ్ఎంసీజీ, ఆటో సూచీలు కూడా మంచి పనితీరు కనబరిచాయి. అయితే, ఐటీ, మెటల్, ఫార్మా సూచీలు మాత్రం కాస్త బలహీనంగా ముగిశాయి.
2026 క్యాలెండర్ ఇయర్ రెండో అర్ధభాగంలోకి మార్కెట్లు ఆశాజనకంగా ప్రవేశించాయని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై అంచనాలు, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గడం, చమురు ధరలు అదుపులో ఉండటం వంటి సానుకూల అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.