విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర? ఎమ్మెల్యేలకు రూ.35 కోట్ల ఆఫర్ ఆరోపణలు
- 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాల ద్వారా ప్రభుత్వం పడగొట్టే యత్నమని ప్రచారం
- ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్ ఇచ్చారన్న ఆరోపణలతో ముగ్గురి అరెస్ట్
- డీఎంకే నేత సెంథిల్ బాలాజీ పేరు ప్రస్తావనకు రావడం రాజకీయంగా చర్చనీయాంశం
- ఆరోపణలను డీఎంకే ఖండిస్తూ.. ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవాలని సవాల్
ఎన్‌డీటీవీ కథనం ప్రకారం.. విజయ్ పార్టీకి చెందిన ఉతంగరై ఎమ్మెల్యే ఎన్. ఎలైయరాజా ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌పై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని, అందుకు రూ.35 కోట్లు ఇస్తామని ఓ కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధి తనను సంప్రదించాడని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ విషయాన్ని బయటకు చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తొలుత చెన్నైలో ఒకరిని, అనంతరం కరూర్‌లో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో ఈ వ్యవహారానికి డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీతో సంబంధాలున్నట్లు గుర్తించినట్లు ఎన్‌డీటీవీ పేర్కొంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు.
ఈ ఘటనపై స్పందించిన తమిళనాడు మంత్రి సీటీ నిర్మల్ కుమార్.. సెంథిల్ బాలాజీకి సన్నిహితులే ఈ కుట్రలో ఉన్నారని ఆరోపించారు. విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పలువురు ఎమ్మెల్యేలకు రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఆఫర్లు ఇచ్చారని కూడా ఆయన ఆరోపించారు.
అయితే ఈ ఆరోపణలను డీఎంకే ఖండించింది. దర్యాప్తు వివరాలను లీక్ చేసి ప్రజల్లో తప్పుడు ప్రచారం సృష్టించే ప్రయత్నం జరుగుతోందని డీఎంకే అధికార ప్రతినిధి ఏ. శరవణన్ విమర్శించారు. తమ వద్ద ఆధారాలు ఉంటే సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు.