సింధు జలాల వివాదం.. ఏకపక్ష చర్యలు వద్దంటూ భారత్‌కు పాక్ హెచ్చరిక
- పాకిస్థాన్‌కు సింధు నది జీవనాధారం అన్న బిలావల్ భుట్టో
- ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేయలేరన్న పాక్ ఉప ప్రధాని
- 2025 పహల్గామ్ దాడి తర్వాత ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్
- ఉగ్రవాదాన్ని ఆపితేనే ఒప్పందం పునరుద్ధరణ అని స్పష్టం చేసిన భారత్
- అంతర్జాతీయ చట్టాలకు ఇది పరీక్ష అని పాక్ నేతలు
"సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం సాధ్యం కాదు. నీటిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదు" అని ఇషాక్ దార్ పేర్కొన్నారు. సింధు నది పాకిస్థాన్‌కు జీవనాధారమని అభివర్ణించిన బిలావల్ భుట్టో, తమ నీటి హక్కులకు భంగం కలిగిస్తే జాతీయ స్థాయిలో తీవ్ర నిరసనలు ఎదురవుతాయని హెచ్చరించారు. నదీ జలాలను ఆయుధాలుగా మలచుకోకుండా కట్టడి చేసేందుకు సరికొత్త అంతర్జాతీయ ఒప్పందం అవసరమని ఆయన ప్రతిపాదించారు.
2025 ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనుక పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల హస్తం ఉందని భారత్ ఆరోపించగా, పాక్ ఆ వ్యాఖ్యలను ఖండించింది. అయితే, సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా అరికట్టే వరకు ఈ ఒప్పందం పునరుద్ధరణ సాధ్యం కాదని భారత్ తన పట్టును స్పష్టం చేస్తోంది.
1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం, ఇరు దేశాల మధ్య పలు యుద్ధాలు సంభవించినప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ ఒప్పందం నిబంధనల ప్రకారం రావి, సట్లెజ్, బియాస్ నదులపై భారత్‌కు.. సింధు, జీలం, చీనాబ్ నదులపై పాకిస్థాన్‌కు సర్వ హక్కులు కల్పించారు.