పూటకో మాట.. ప్రజలను గందరగోళపరచడమే జగన్ పని: మంత్రి గొట్టిపాటి రవికుమార్
- జగన్ మావిగన్ నినాదంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కౌంటర్
- రాష్ట్రంపై కక్ష సాధింపు కోసమే జగన్ మావిగన్ పాట అందుకున్నారని విమర్శ
- మూడు రాజధానుల పిచ్చి సిద్ధాంతంతోనే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని ఎద్దేవా
- మావిగన్ నినాదంతో సింగిల్ డిజిట్‌కు పరిమితం కావడం ఖాయమని జోస్యం
- రాజధాని విషయంలో జగన్ పూటకో మాట మాట్లాడుతున్నారని ఆరోపణ
ఈ సందర్భంగా గొట్టిపాటి మాట్లాడుతూ.. "గతంలో మూడు రాజధానులనే పిచ్చి సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్దాలని చూశారు. దాని ఫలితంగానే వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. ఇప్పుడు ఈ మావిగన్ సిద్ధాంతంతో ఆ పార్టీ సింగిల్ డిజిట్‌కు పడిపోవడం ఖాయం" అని జోస్యం చెప్పారు. రాష్ట్రం అంటే సవాళ్లు విసరడం కాదని, అభివృద్ధి చేయడం అని జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. ఇటీవల మీడియా మూడు రాజధానుల విషయంపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక జగన్ అక్కడి నుంచి పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు.
రాజధాని విషయంలో జగన్ గతంలో చేసిన వ్యాఖ్యలను గొట్టిపాటి గుర్తుచేస్తూ సూటి ప్రశ్నలు సంధించారు. "నాడు అసెంబ్లీ వేదికగా రాజధాని 30 వేల ఎకరాలకు తగ్గకుండా చూడాలని చెప్పింది మీరు కాదా? అమరావతిలో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటానని హామీ ఇచ్చింది నిజం కాదా? తీరా ముఖ్యమంత్రి అయ్యాక ఆ మాటలన్నీ మరిచి మూడు రాజధానుల పాట అందుకున్నది మీరు కాదా?" అని నిలదీశారు.
విశ్వనగరంగా ఉన్న హైదరాబాద్ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని, అమరావతి కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందకూడదన్నదే జగన్ దుర్బుద్ధి అని గొట్టిపాటి ఆరోపించారు. పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేయడం ఆయన దుర్మార్గపు ఆలోచనల్లో భాగమని అన్నారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకునే ఏ ప్రయత్నాన్ని అయినా సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.