'వొడాఫోన్ ఐడియా' నుంచి రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
- 4జీ, 5జీ యూజర్ల కోసం రెండు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చిన వొడాఫోన్ ఐడియా
- రూ. 4600తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్ ప్లాన్
- రూ. 2475తో 180 రోజుల వ్యాలిడిటీ ప్లాన్
టెలికాం రంగంలో పోటీని మరింత పెంచుతూ ప్రముఖ సంస్థ 'వొడాఫోన్ ఐడియా' (Vi) తన వినియోగదారుల కోసం రెండు సరికొత్త ధమాకా ప్రీపెయిడ్ ప్లాన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా డేటా ఎక్కువగా వాడే 4జీ, 5జీ యూజర్లను టార్గెట్ చేస్తూ రూ. 4600 ధరతో ఒక భారీ వార్షిక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశంలోని కొన్ని ఎంపిక చేసిన సర్కిళ్లలోనే అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్, త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.
పూర్తిగా 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ వార్షిక ప్లాన్ ద్వారా యూజర్లు రోజూ ఎలాంటి లిమిట్ లేకుండా అపరిమిత డేటాను, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు. దీనితో పాటు రోజుకు 100 ఉచిత ఎస్సెమ్మెస్‌లు కూడా లభిస్తాయి. అయితే, ఈ అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్ కేవలం వ్యక్తిగత, నాన్-కమర్షియల్ వినియోగానికి మాత్రమే వర్తిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. అలాగే రోజువారీ పరిమితి ఏమీ లేకపోయినప్పటికీ.. ప్రతి 28 రోజులకు గరిష్ఠంగా 300 జీబీ వరకు మాత్రమే హై-స్పీడ్ డేటా వాడుకునే వీలుంటుంది. ఆ పరిమితి దాటితే ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు సగటున రూ. 12.6 మాత్రమే ఖర్చవుతుంది.
ఈ వార్షిక ప్లాన్‌తో పాటే 6 నెలల వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం వొడాఫోన్ ఐడియా మరో ప్లాన్‌ను కూడా లాంచ్ చేసింది. రూ. 2,475 ధరతో వచ్చే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా 180 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. వార్షిక ప్లాన్ లాగే ఇందులోనూ అపరిమిత డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు అదే డేటా పరిమితి నిబంధనలు వర్తిస్తాయి. దీర్ఘకాలిక ప్లాన్ల కోసం చూసే Vi కస్టమర్లకు ఇవి మంచి ఆప్షన్లుగా మారనున్నాయి.