శ్రీకాకుళంలో తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యాయత్నం
- ఇద్దరు కన్నబిడ్డల గొంతు కోసి చంపిన తల్లి
- అనంతరం గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం
- ఆసుపత్రిలో విషమంగా మహిళ పరిస్థితి
- ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పోలీసుల కథనం ప్రకారం.. వెదుళ్లవలస గ్రామానికి చెందిన కుర్మారపు వరలక్ష్మి అనే మహిళ, తన ఇద్దరు చిన్నారుల గొంతులు కోసి దారుణంగా హత్య చేసింది. ఆపై అదే కత్తితో తన గొంతు కోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించింది. ఈ ఘోరాన్ని గమనించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వరలక్ష్మిని హుటాహుటిన శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ దారుణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, విచారణలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.