హోమ్‌స్టేలో ఫిజియోథెరపిస్ట్ అనుమానాస్పద మృతి.. పక్కనే అపస్మారక స్థితిలో ప్రియుడు
- కర్ణాటక హోమ్‌స్టేలో బెంగళూరు ఫిజియోథెరపిస్ట్ అనుమానాస్పద మృతి
- గదిలోనే అపస్మారక స్థితిలో లభించిన ప్రియుడు.. ఆసుపత్రికి తరలింపు
- ఇది లవ్ జిహాద్ హత్యేనని ఆరోపిస్తున్న యువతి కుటుంబ సభ్యులు
- యువతి తల్లి ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మృతురాలిని బెంగళూరుకు చెందిన సాయి సురభి (25)గా గుర్తించారు. ఆమె ముద్దేనహళ్లిలోని ఒక ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అపస్మారక స్థితిలో లభించిన యువకుడిని కేరళకు చెందిన సంజీత్ అలీ (26)గా గుర్తించారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఇతను బెంగళూరులో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హోమ్‌స్టే సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, లోపలి నుంచి గడియ పెట్టి ఉన్న తలుపులను పగలగొట్టి ప్రవేశించారు.
ఘటనా స్థలంలో పోలీసులు ఒక తాడు, కొన్ని మాత్రలు, వాంతులకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు. యువతి శరీరంపై ఎలాంటి బాహ్య గాయాలు లేవని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చిక్కబళ్లాపూర్ ఎస్పీ కుశాల్ చౌక్సీ తెలిపారు. అన్ని కోణాల్లో కేసును విచారిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
సాయి సురభి, సంజీత్ అలీ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, వీరిది మతాంతర ప్రేమ కావడంతో యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఇది 'లవ్ జిహాద్' హత్యేనని, తన కుమార్తెను సంజీత్ అలీయే పక్కా ప్రణాళికతో హత్య చేశాడని మృతురాలి తల్లి గీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు స్పృహలోకి వస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.