ముంబై కోకిలా బెన్ ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌కు వైద్యపరీక్షలు... వెంటనే శస్త్రచికిత్స చేయాలన్న డాక్టర్లు
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ముంబైలో వైద్య పరీక్షలు
- చేతి కండరాలకు తీవ్ర గాయమైనట్టు నిర్ధారించిన వైద్యులు
- వెంటనే శస్త్రచికిత్స అవసరమని కీలక సూచన
- కార్యక్రమాలు పూర్తయ్యాకే సర్జరీ చేయించుకుంటానన్న పవన్
సోమవారం నాడు తన భార్య అన్నా లెజినోవాతో కలిసి పవన్ ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఆయన రెండు భుజాలను క్షుణ్ణంగా పరీక్షించిన వైద్య బృందం, రొటేటర్ కఫ్‌తో పాటు చేతికి సంబంధించిన రెండు కండరాలకు తీవ్ర గాయమైనట్టు గుర్తించింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నందున, తక్షణమే శస్త్రచికిత్స చేయించుకోవడం ఉత్తమమని వైద్యులు సిఫార్సు చేశారు. ఈ మేరకు ఆయనకు పూర్తి నివేదికను అందజేశారు.
అయితే, వైద్యుల సూచనపై స్పందించిన పవన్ కల్యాణ్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ముందుగా నిర్దేశించుకున్న ప్రభుత్వ కార్యక్రమాలను, పరిపాలనా బాధ్యతలను పూర్తి చేయడం తన కర్తవ్యమని ఆయన భావించారు. ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాతే శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరతానని తెలిపారు. ఈ మేరకు అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకుని తిరిగి వస్తానని ఆయన పేర్కొన్నారు.
కాగా, పవన్ కల్యాణ్ గత కొంతకాలంగా చేతి నొప్పితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. రెండు చేతుల కండరాలు పూర్తిగా దెబ్బతినడంతో పాటు, రొటేటర్ కఫ్ గాయంతో ఆయన అసౌకర్యానికి గురవుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ ఈ నొప్పి ఆయన్ను వేధించింది.