అయోధ్య విరాళాల వివాదం... కెమిస్ట్రీ లెక్చరర్ నుంచి రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి వరకు.. చంపత్ రాయ్ ప్రస్థానం!

Champat Rai From Chemistry Lecturer level to Ram Temple Trust General Secretary
  • విరాళాల గోల్‌మాల్ ఆరోపణలతో చంపత్ రాయ్ రాజీనామా
  • రామ మందిర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి వైదొలగిన వైనం
  • డిగ్రీ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా ప్రస్థానం ప్రారంభం
  • ఎమర్జెన్సీ సమయంలోఅరెస్టు.. 18 నెలల పాటు జైలు జీవితం
అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు.

విరాళాల రూపంలో అందిన నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో భాగంగా చంపత్ రాయ్ మాజీ సహాయకుడితో సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులు జరిగిన మరుసటి రోజే చంపత్ రాయ్, అనిల్ మిశ్రా తమ పదవుల నుంచి వైదొలగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్‌లో వీరిద్దరి పేర్లు లేకపోవడం గమనార్హం.

రామమందిర ఉద్యమంలో చంపత్ రాయ్ దశాబ్దాలుగా క్రియాశీలక పాత్ర పోషించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన న్యాయపోరాటం నుంచి భూమి పూజ, ప్రాణప్రతిష్ఠ వరకు అన్ని వ్యవహారాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. మందిర నిర్మాణ సమయంలో ట్రస్ట్ కార్యకలాపాల్లో అత్యంత కీలక వ్యక్తిగా వ్యవహరించారు. ఈ వివాదంపై ఆరెస్సెస్, వీహెచ్‌పీ వర్గాల నుంచి ఒత్తిడి రావడంతోనే వారు రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది.

చంపత్ రాయ్ 2020లో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన ప్రస్థానం బిజ్నోర్‌లోని ధాంపూర్‌లో గల ఆర్ఎస్ఎం డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్రం అధ్యాపకుడిగా ప్రారంభమైంది. 1977లో ఎమర్జెన్సీ సమయంలో ఆరెస్సెస్ తరఫున కళాశాలలో ఉపన్యసిస్తున్న తరుణంలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆయన 18 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు.

అనంతరం 1980లో బోధన వృత్తిని విడిచిపెట్టి విశ్వహిందూ పరిషత్‌లో చేరారు. అశోక్ సింఘాల్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన చంపత్ రాయ్, అవధ్ ప్రాంతంలో రామజన్మభూమి ఉద్యమం బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. 

ఆగ్రా, డెహ్రాడూన్, హరిద్వార్‌ ప్రాంతాల్లో ఆరెస్సెస్ నెట్‌వర్క్‌ను పటిష్ఠం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1980, 90వ దశకాల్లో ఆయనతో కలిసి పనిచేసిన వారు చంపత్ రాయ్‌ను 'అయోధ్య విజ్ఞాన సర్వస్వం'గా అభివర్ణిస్తారు.

వివిధ తరాలకు చెందిన బీజేపీ అగ్రనేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కరసేవకుడిగా ఆయన ఘటనాస్థలిలోనే ఉన్నారు. ఈ ఉదంతానికి సంబంధించి సీబీఐ దాఖలు చేసిన నేరపూరిత కుట్ర అభియోగపత్రంలో ఆయన పేరును కూడా చేర్చారు. 

సుమారు మూడు దశాబ్దాల సుదీర్ఘ విచారణ అనంతరం, 2020లో లక్నో కోర్టు ఆయనతో పాటు ఇతర కరసేవకులను నిర్దోషులుగా ప్రకటించింది. ఆ తర్వాతే ఆయన అయోధ్య రామమందిర నిర్మాణ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.

2020 ఆగస్టు 5న జరిగిన భూమి పూజ నుంచి 2024 జనవరి 22న జరిగిన ప్రాణప్రతిష్ఠ వేడుక వరకు చంపత్ రాయ్ అన్నింటా కీలకంగా వ్యవహరించారు. 2021లో ఆయన 'నిధి సమర్పణ్ అభియాన్' బాధ్యతలు స్వీకరించి, ఆలయ నిర్మాణం కోసం రూ. 2,000 కోట్లకు పైగా విరాళాలను సేకరించారు. మందిర ప్రతిష్ఠాపన జరిగిన అనంతరం, ఈ విరాళాలు పక్కదారి పట్టాయంటూ ఆరోపణలు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
Champat Rai
Ram Mandir Trust
Ayodhya donation scam
Shri Ram Janmabhoomi Teerth Kshetra

More Telugu News