ఐఐటీల్లో కొత్త నిబంధన.. ప్లేస్‌మెంట్‌ సీవీల్లో జేఈఈ, ‘గేట్‌’ ర్యాంకులు రాయొద్దు!

IIT New Rule No JEE and GATE Ranks in Placement CVs
  • ఐఐటీల ప్లేస్‌మెంట్‌ సీవీల్లో జేఈఈ, గేట్‌ ర్యాంకులకు నో
  • 23 ఐఐటీల ఉమ్మడి ప్లేస్‌మెంట్‌ కమిటీ నిర్ణయం
  • ర్యాంకుల ఆధారంగా వివక్ష నివారణే లక్ష్యం
  • ఐఐటీలో సాధించిన విజయాలకే ప్రాధాన్యం
  • సీవీలో ప్రాజెక్టులు, నైపుణ్యాలు ప్రముఖంగా చూపే అవకాశం
  • నిర్ణయానికి మద్దతుతో పాటు విమర్శలు
ఒకప్పుడు ఐఐటీలో సీటు సాధించడం మాత్రమే కాదు.. జేఈఈ లేదా ‘గేట్‌’లో వచ్చిన ర్యాంక్ కూడా విద్యార్థుల గర్వకారణంగా ఉండేది. కానీ ఇకపై క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో ఆ ర్యాంకులు కనిపించకపోవచ్చు. దేశంలోని 23 ఐఐటీల ఉమ్మడి ప్లేస్‌మెంట్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌ల కోసం సమర్పించే సీవీల్లో జేఈఈ ర్యాంక్‌, గేట్‌ స్కోర్‌, పర్సంటైల్‌ వంటి వివరాలు చేర్చొద్దని విద్యార్థులకు సూచించింది.

ఎందుకీ నిర్ణయం?
విద్యార్థులను ప్రవేశ పరీక్షల్లో సాధించిన ర్యాంకుల ఆధారంగా కాకుండా ఐఐటీలో చేరిన తర్వాత వారి ప్రతిభ, నైపుణ్యాలు, సాధించిన విజయాల ఆధారంగా అంచనా వేయాలన్నదే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని కమిటీ తెలిపింది. కొన్ని సందర్భాల్లో ర్యాంకులను బట్టి విద్యార్థి ఏ కేటగిరీలో సీటు పొందారో గుర్తించే అవకాశం ఉందని, దీంతో నియామక ప్రక్రియలో వివక్షకు తావుండొచ్చనే ఆందోళన వ్యక్తమైంది.

సీవీలో ఏమేం ఉండొచ్చు?
కొత్త మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు తమ సీపీఐ, విద్యా ప్రతిభ, ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధన, నాయకత్వ అనుభవం, సాంకేతిక నైపుణ్యాల వంటి వివరాలను సీవీలో పొందుపరచవచ్చు. ఒకవేళ కంపెనీలు ప్రత్యేకంగా అడిగితే మాత్రమే ప్రవేశ పరీక్షల ర్యాంకులు లేదా స్కోర్లు అందించే అవకాశం ఉంటుంది.

మద్దతు.. విమర్శలు
ఈ నిర్ణయాన్ని కొందరు సమాన అవకాశాలకు దోహదపడే చర్యగా స్వాగతించారు. మరోవైపు జేఈఈ, గేట్‌ ర్యాంకులు కష్టపడి సాధించిన విజయాలని, వాటిని దాచాల్సిన అవసరం ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రతిభకు గుర్తింపు తగ్గిపోతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Go Back to Shorts
IIT
JEE Main Rank
GATE Score
IIT Campus Placements
Student CV Guidelines
IIT Placement Committee

More Telugu News