వనరుల కొరత లేదు.. నమ్మకం లోపమే అసలు సమస్య: జీ7లో ప్రధాని మోదీ
- ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో ప్రధాని మోదీ కీలక ప్రసంగం
- ప్రపంచం వనరుల కొరతతో కాకుండా నమ్మకం లోపంతో బాధపడుతోంది
- పరస్పర నమ్మకమే నేటి అతిపెద్ద వ్యూహాత్మక ఆస్తి అని వ్యాఖ్య
- దాత-గ్రహీత సంబంధాల స్థానంలో సమాన భాగస్వామ్యం ఉండాలని పిలుపు
"నూతన భాగస్వామ్యాల నిర్మాణం, అంతర్జాతీయ సంఘీభావం పునరుద్ధరణ" అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ.. "ప్రపంచం వనరుల కొరతతో కాకుండా, నమ్మకం కొరతతో సతమతమవుతోంది. ఈ విశ్వాసాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడంపైనే మన భాగస్వామ్యాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది" అని స్పష్టం చేశారు. ఈ మేరకు తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా పంచుకున్నారు.
ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భారతీయ తత్వశాస్త్రం "వసుధైవ కుటుంబకం" గురించి మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. దాత-గ్రహీత సంబంధాల నుంచి ప్రపంచం బయటపడాలని, ఆత్మగౌరవం, పరస్పర గౌరవంతో కూడిన సమాన భాగస్వామ్యాల వైపు పయనించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సౌర కూటమి, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాల ద్వారా భారత్ ప్రపంచ సహకారానికి ఏ విధంగా కృషి చేస్తోందో ఆయన వివరించారు.
'గ్లోబల్ సౌత్' దేశాల గళాన్ని అంతర్జాతీయ వేదికలపై వినిపించడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందని మోదీ పునరుద్ఘాటించారు. ఈ పర్యటనలో భాగంగా కెనడా ప్రధాని మార్క్ కార్నీతో పాటు పలువురు ప్రపంచ నేతలతో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.