అగ్రకులంలో పుట్టినా.. బడుగుల కోసమే పనిచేస్తా: కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha says she will work for marginalized sections despite being born in upper caste
  • సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యమన్న కవిత
  • 90 శాతం బహుజనులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన
  • బీసీ రిజర్వేషన్ల బిల్లుపై రేవంత్, కిషన్ రెడ్డిని నిలదీసిన టీఆర్ఎస్ అధినేత్రి
  • బడ్జెట్ సమావేశాల్లోగా బిల్లు పాస్ చేయకుంటే ‘ఛలో ఢిల్లీ’ హెచ్చరిక
  • చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సహా 11 తీర్మానాలు
సామాజిక తెలంగాణ సాధన కోసం తన పూర్తి జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్‌ఎస్) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అట్టడుగు, అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు దక్కేవరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన "సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ"లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 శాతం ఉన్న బహుజన వర్గాలకు రాజకీయ, సామాజిక అవకాశాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. "కేవలం 10 శాతం ఉన్న వర్గాలు 90 శాతం అవకాశాలను అనుభవిస్తున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ ఆశించిన సామాజిక తెలంగాణ సాధన కోసమే ఈ ఉద్యమం మొదలుపెట్టాం" అని తెలిపారు. తన కులంపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ "నా పుట్టుక నా చేతిలో లేదు. కానీ ఎవరి కోసం పనిచేయాలో నిర్ణయించుకునే హక్కు నాకుంది" అని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ జనాభా లెక్కల్లో మోసానికి పాల్పడిందని కవిత ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కోసం సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కలిసి ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నించారు. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోగా బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపకపోతే, 1,000 కార్లతో 'ఛలో ఢిల్లీ' కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.

ఈ సభలో భాగంగా చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని, ట్యాంక్‌బండ్‌పై జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో పాటు మొత్తం 11 తీర్మానాలను ఆమోదించారు.
Advertisement
Kalvakuntla Kavitha
Telangana Rakshana Sena
Professor Jayashankar
BC Reservation Bill
Samajika Nyaya Telangana
Chalo Delhi Protest

More Telugu News