రైడర్ నిర్లక్ష్యంతో ట్రాక్టర్ కింద పడ్డా.. రూ. 20 లక్షల బిల్లు వేస్తే హ్యాండ్ ఇచ్చారు: రాపిడోపై బెంగళూరు మహిళ లీగల్ వార్!

Rapido Bengaluru woman legal battle over 20 lakh hospital bill after tractor accident
  • రాపిడో రైడర్ నిర్లక్ష్యంతో మహిళకు ఘోర ప్రమాదం
  • ఆసుపత్రిలో రూ. 20 లక్షల ఖర్చు 
  • రాపిడో పట్టించుకోలేదని బాధితురాలి ఆవేదన
  • కంపెనీకి లీగల్ నోటీసులు, కన్స్యూమర్ కోర్టును ఆశ్రయిస్తానని వెల్లడి
  • డాక్యుమెంట్లు ఇస్తేనే క్లెయిమ్ ప్రాసెస్ చేస్తామంటున్న రాపిడో సంస్థ
ప్రముఖ బైక్ ట్యాక్సీ యాప్ రాపిడో సేవలు, ప్రయాణికుల భద్రతపై బెంగళూరులో వివాదం చెలరేగింది. రాపిడో రైడర్ నిర్లక్ష్యం కారణంగా ఘోర ప్రమాదానికి గురయ్యానని, ఆసుపత్రిలో రూ. 20 లక్షలకు పైగా ఖర్చయ్యాయని, కంపెనీ తమను పూర్తిగా గాలికొదిలేసిందని ఓ మహిళ ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఆమె రాపిడో సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేయడమే కాకుండా, వినియోగదారుల ఫోరంను ఆశ్రయించనున్నట్లు తెలిపింది.

కేరళకు చెందిన 32 ఏళ్ల సానీ కృష్ణ బెంగళూరులో ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. జూన్ 17న, ఆమె బైరసంద్ర నుంచి డోమ్లూర్‌లోని తన కార్యాలయానికి వెళ్లేందుకు రాపిడో బైక్ బుక్ చేసుకున్నారు. ప్రయాణం మొదలైన కాసేపటికే బాగ్‌మనే టెక్ పార్క్ సమీపంలో రైడర్ రాంగ్ రూట్‌లో వేగంగా వెళ్తూ ఓ ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పడంతో సానీ కృష్ణ రోడ్డుపై పడిపోగా, వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్ ఆమెపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై సానీ కృష్ణ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో ద్వారా తన ఆవేదనను పంచుకున్నారు. "మహిళల భద్రత కోసం కోట్లు ఖర్చుపెట్టి ప్రచారం చేసుకునే రాపిడో, నన్ను నడిరోడ్డుపై వదిలేసింది. ఆసుపత్రి బిల్లు రూ. 20 లక్షలు దాటింది. లీగల్ నోటీసు పంపితే, ఇన్సూరెన్స్ పేరుతో కేవలం రూ. లక్ష ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తోంది. రాపిడో భద్రతా హామీలన్నీ కేవలం మార్కెటింగ్ గిమ్మిక్కులు మాత్రమే" అని ఆమె ఆరోపించారు.

ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాపిడో సంస్థ స్పందించింది. సానీ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై తాము ఆందోళనగా ఉన్నామని, తమ బృందం ఆమె కుటుంబంతో టచ్‌లో ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లను బాధితురాలి వైపు నుంచి ఇంకా సమర్పించలేదని, అవి అందిన వెంటనే ప్రక్రియను వేగవంతం చేస్తామని వివరించింది.  
Advertisement
Rapido
Sani Krishna
Bengaluru bike taxi accident
Rapido insurance claim
Consumer Forum legal notice
Road safety negligence

More Telugu News