నెలకు రూ.20 వేల అదనపు ఆదాయం కావాలా? చాట్ జీపీటీ ఏం చెప్పిందో చూడండి!
- అదనపు ఆదాయం కోసం ఇతర పనులు చేయాలనుకుంటున్నారా?
- సంపాదించే ముందు ఖర్చులను సమీక్షించుకోవాలని చాట్‌జీపీటీ సూచన
- గంటకు ఎంత సంపాదించగలరో లెక్కించుకోవడం చాలా ముఖ్యం
- 90 రోజుల ప్రయోగంతో మీ ఆలోచనను పరీక్షించుకోవచ్చు
- కుటుంబ బంధం, నిద్ర కంటే అదనపు ఆదాయం ముఖ్యం కాదు
వివరాల్లోకి వెళితే, ఒక జంటలో భర్త జీతం రూ. 12 లక్షలు, భార్య జీతం రూ. 10 లక్షలు. వారికి పెద్దగా అప్పులు లేనప్పటికీ, పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా అదనపు ఆదాయం కోసం ప్రయత్నించాలనుకున్నారు. రోజుకు 2-3 గంటల సమయం కేటాయించగలమని, అయితే హాబీలను వ్యాపారంగా మార్చడం, యూట్యూబ్, ఇన్‌ఫ్లుయెన్సర్ వంటి వాటిపై ఆసక్తి లేదని స్పష్టం చేశారు. వాస్తవికమైన, మార్కెట్‌లో నిరూపితమైన మార్గాలను సూచించమని కోరారు.
దీనికి చాట్‌జీపీటీ ఇచ్చిన సలహా చాలామందిని ఆలోచింపజేస్తోంది. "కొత్తగా సంపాదించడం కంటే ముందు, మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకోండి. నెలవారీ ఖర్చుల్లో రూ. 20,000 తగ్గించుకోగలిగితే, అది కొత్తగా సంపాదించడంతో సమానం. పైగా, దీనికి పన్నులు ఉండవు, అదనపు సమయం కేటాయించాల్సిన అవసరం లేదు" అని సూచించింది.
ఒకవేళ ఇతర పనులు చేయాలని నిశ్చయించుకుంటే, రోజులో ఎన్ని గంటలు పనిచేయగలరు?.. ఎంత ఆదాయం వస్తుంది?.. ఆ ప్రకారం గంటకు ఎంత సంపాదించగలరో లెక్కించుకోవాలని చెప్పింది. ఉద్యోగ నైపుణ్యాలతో చేసే కన్సల్టింగ్, ఫ్రీలాన్సింగ్ వంటివి ఉత్తమ మార్గాలని, అదే సమయంలో అధిక సమయం తీసుకునే ఈ-కామర్స్, డ్రాప్‌షిప్పింగ్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిదని సలహా ఇచ్చింది.
అంతేకాకుండా, "90 రోజుల ప్రయోగం" పేరుతో ఒక యాక్షన్ ప్లాన్‌ను కూడా సూచించింది.
మొదటి నెల: ఒకే ఒక వ్యాపార ఆలోచనను ఎంచుకోవాలి.
రెండో నెల: డబ్బులిచ్చి సేవలు పొందే మొదటి కస్టమర్‌ను సంపాదించాలి.
మూడో నెల: కనీసం రూ. 5,000 ఆదాయం సంపాదించి, ఆలోచన ఆచరణ సాధ్యమేనా అని నిర్ధారించుకోవాలి.
ఆదాయం రావడం మొదలయ్యే వరకు వెబ్‌సైట్, బ్రాండింగ్ వంటి వాటిపై సమయం, డబ్బు వృథా చేయవద్దని చాట్‌జీపీటీ నొక్కి చెప్పింది. ఆరు నెలల తర్వాత కూడా ఆదాయం రాకపోయినా, ఈ ప్రయత్నం వల్ల వైవాహిక జీవితంలో ఒత్తిడి పెరిగినా, నిద్ర కరవైనా వెంటనే ఆపేయడం మేలని హితవు పలికింది.