సాధారణంగా కూరగాయలు కొనడానికి మార్కెట్‌కు వెళ్లినప్పుడు మనం వాటి ధరల గురించి చర్చిస్తాం. కానీ, అమెరికాలో ఓ భారతీయుడు బెండకాయ ధర చూసి అవాక్కై, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇండియాలో అత్యంత చౌకగా, సాధారణ కూరగాయగా దొరికే బెండకాయకు అమెరికాలో ఉన్న ధర చూస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఓ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లిన భారతీయుడు అక్కడ ప్యాక్ చేసి అమ్మకానికి పెట్టిన బెండకాయలను చూశాడు. అయితే, పచ్చి బెండకాయల ధర పౌండ్‌కు దాదాపు 40 డాలర్లుగా ఉంది. దీన్ని భారత కరెన్సీలోకి మార్చి, కిలోకు లెక్కిస్తే సుమారు రూ.7,200 అవుతుందని అతను ఆశ్చర్యపోయాడు.

అంతేకాదు, అదే సూపర్‌ మార్కెట్‌లో మసాలాలు దట్టించి, ఫ్రై చేసిన బెండకాయలను స్నాక్‌గా అమ్ముతున్నారు. "చూడండి, ఇండియాలో మనం కూర చేసుకునే బెండకాయలు అమెరికాలో స్నాక్‌గా దొరుకుతున్నాయి. మసాలాలు వేసి, బాగా వేయించి ప్యాక్ చేశారు. దీని ధర ఎంత ఉందో చూడండి. 6.50 డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.600. మరి పరిమాణం ఎంతో తెలుసా? కేవలం 85 గ్రాములు," అంటూ ఆ వీడియోలో వివరించాడు. "మన దగ్గర రోజూ తినే సాధారణ బెండకాయ, ఇక్కడ లేస్ ప్యాకెట్ కంటే ఖరీదైన ప్రీమియం స్నాక్" అని అతను తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు క్యాప్షన్ జతచేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 2.48 లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. "అమెరికన్ల ఆదాయం ఎక్కువ కాబట్టి వారికి ఇది పెద్ద ఖరీదేమీ కాదు," అని ఒకరు కామెంట్ చేయగా, "ఈ మసాలాలతో కలిపినా ఇక్కడ (భారత్‌లో) రూ.20కి మించి పెట్టం. ధనవంతులు కూడా కొనరు," అని మరొకరు చమత్కరించారు. మరో యూజర్ సరదాగా "మనం ఒక ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ వ్యాపారం మొదలుపెడితే బాగుంటుంది" అని కామెంట్ పెట్టారు. విదేశాల్లో సరఫరా తక్కువగా ఉండటం, దిగుమతి ఖర్చులు వంటి కారణాల వల్ల భారతీయ కూరగాయలు ప్రత్యేక ఉత్పత్తుల కేటగిరీ కిందకు వచ్చి అధిక ధరలకు అమ్ముడవుతాయని నిపుణులు చెబుతున్నారు.