మురసు తుపాను ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ యంత్రాంగం పటిష్ఠమైన ముందస్తు చర్యలు చేపట్టింది. భక్తుల భద్రత, సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యమని, దర్శనం నుంచి అన్నప్రసాదం వరకు ఎక్కడా లోటుపాట్లు రాకుండా చూడాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో ఆయన వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, పలు కీలక సూచనలు జారీ చేశారు.

వర్షాల కారణంగా భక్తులు ఇబ్బంది పడకుండా, సాధ్యమైనంత వరకు క్యూలైన్లు కాంప్లెక్స్‌ల లోపలే ఉండేలా చూడాలని, త్వరితగతిన దర్శనం కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. వర్షం వల్ల అన్నప్రసాద వితరణకు ఆటంకం కలగకుండా అవసరమైన చోట్ల టార్పాలిన్లు ఏర్పాటు చేసి, నిరంతరాయంగా భక్తులకు ఆహారం అందించాలని సూచించారు. వసతి గదులు, కంపార్ట్‌మెంట్లలో బస చేసిన భక్తులు సురక్షితంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భారీ వర్షాల వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉన్నందున, విద్యుత్, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు పూర్తి అప్రమత్తతతో ఉండాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఘాట్ రోడ్ల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని వెంకయ్య చౌదరి సూచించారు. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే లేదా చిన్న రాళ్లు జారిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ నిరంతరం పర్యవేక్షణ జరపాలని తెలిపారు. అప్, డౌన్ ఘాట్ రోడ్లలో భద్రతా చర్యలను మరింత పటిష్ఠం చేయాలన్నారు. వర్షం కారణంగా నడక మార్గాల్లో, ఆలయ పరిసరాల్లో భక్తులు జారిపడి గాయపడే అవకాశం ఉన్నందున, వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని, వారికి తక్షణమే ప్రథమ చికిత్స అందించేలా చూడాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు సూచించారు.

భక్తుల యాత్ర సురక్షితంగా, సులభంగా సాగేలా చూసేందుకు అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో ఒక బృందంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకుని, క్షేమంగా తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లేలా చూడటమే మనందరి బాధ్యత అని ఆయన గుర్తుచేశారు. ఈ సమావేశంలో టీటీడీ చీఫ్ ఇంజినీర్ మనోహరం, ఎస్ఇ వేణుగోపాల్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమకుమారి, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర తదితర అధికారులు పాల్గొన్నారు.