ఆలోచించి కొనాలట... భారత మామిడిపండ్లపై అక్కసు వెళ్లగక్కిన అమెరికా జర్నలిస్టు!
- భారత మామిడి పండ్లను విమర్శించిన అమెరికన్ కన్జర్వేటివ్ కామెంటేటర్
- మామిడి పండ్లు అసహ్యంగా ఉన్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు
- అమెరికాలో భారత మామిడికి భారీ డిమాండ్ నెలకొన్న వేళ ఈ వ్యాఖ్యలు
- ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, వ్యతిరేకత
టెక్సాస్‌కు చెందిన జర్నలిస్ట్, బ్లేజ్ టీవీ హోస్ట్ సారా గొంజాలెజ్ ఒక పాడ్‌కాస్ట్‌లో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగినపల్లి వంటి భారతీయ మామిడి రకాలపై ప్రజలు చూపుతున్న ఉత్సాహాన్ని ఆమె ఎద్దేవా చేశారు. "నేను అటువంటి మామిడి పండ్లను ఎప్పుడూ రుచి చూడలేదు. వాటి గురించి వినడానికి కూడా అంత బాగున్నట్టు లేదు. అవి అసహ్యంగా ఉన్నాయి" అని వ్యాఖ్యానించారు. భారతీయ ఉత్పత్తులనే నెపంతో వాటి పరిశుభ్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, కొనుగోలు చేసే ముందు అమెరికన్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని ఆమె సూచించారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అమెరికాలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత సీజన్‌లో అక్కడి మార్కెట్‌లో అల్ఫాన్సో, కేసర్ వంటి భారతీయ మామిడి రకాలకు భారీ డిమాండ్ నెలకొంది. విక్రయ కేంద్రాల వద్ద పొడవైన క్యూలు ఉండటమే కాకుండా, ధరలు అధికంగా ఉన్నప్పటికీ నిల్వలు నిమిషాల్లో అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా భారతీయ సంతతి ప్రజలు ఈ పండ్లను కొనుగోలు చేసేందుకు విశేష ఆసక్తి కనబరుస్తున్నారు.
సారా గొంజాలెజ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆమె వ్యాఖ్యలు సాంస్కృతిక అహంకారాన్ని, మూస ధోరణులను ప్రతిబింబిస్తున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. హెచ్-1బీ వీసాలపై తనకున్న వ్యతిరేకతను, భారతీయ సాంస్కృతిక ప్రతీకలుగా నిలిచే మామిడి పండ్లపైకి మళ్లిస్తున్నారని విమర్శించారు. కాగా, భారత్ నుంచి దిగుమతి అవుతున్న మామిడి పండ్ల విషయంలో అమెరికా ఆరోగ్య శాఖ నుంచి ఎటువంటి అధికారిక హెచ్చరికలు జారీ కాలేదు. అమెరికా అధికారులు అత్యంత కఠినమైన నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఈ పండ్లను మార్కెట్లోకి అనుమతిస్తారు.