అధికార దాహంతో పాక్‌ను బలిపీఠం ఎక్కిస్తున్న అసిమ్ మునీర్!
- ఇప్పటికే సైనిక వ్యవస్థపై మునీర్‌కు తిరుగులేని పట్టు
- పోలీసు సహా ఇతర రక్షణ విభాగాలన్నింటినీ సైన్యం గుప్పిట్లోకి తెచ్చే యత్నం
- అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలపైనా సైన్యం పెత్తనం
- ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక
ఇప్పటికే దేశ అత్యున్నత నిఘా సంస్థ ‘ఐఎస్ఐ’ను శాసిస్తున్న మునీర్.. తాజాగా దేశంలోని అన్ని పోలీస్ బలగాలను కూడా సైన్యం పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. రక్షణ, అంతర్గత భద్రతకు సంబంధించిన అన్ని విభాగాలను ఒకే కమాండ్ కిందకు తెచ్చి తానే సర్వాధికారిగా మారాలనేది ఆయన వ్యూహం. ఈ ప్రతిపాదన గనుక అమల్లోకి వస్తే పాకిస్థాన్‌లోని ప్రాంతీయ ప్రభుత్వాలపై కూడా పౌర అధికారులకు కాకుండా నేరుగా సైన్యానికే పూర్తి పట్టు దక్కుతుంది.
ఈ ఏకపక్ష పోకడల వల్ల ఆర్మీ చీఫ్‌కు, ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. బడ్జెట్‌లో రక్షణ వ్యయాన్ని ఏకంగా 25 శాతం పెంచాలని మునీర్ పట్టుబడుతున్నారని తెలుస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన తరుణంలో అంత బడ్జెట్ కేటాయించలేమని, ప్రజల కోసం ఖర్చు పెట్టాలని భావిస్తున్న షరీఫ్ ప్రభుత్వం ఈ డిమాండ్‌ను తీవ్రంగా నిరసిస్తోంది.
బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ వంటి ఉగ్రవాద సంస్థలను అణచడంలో భద్రతా దళాల మధ్య సమన్వయం కోసమే ఈ మార్పు చేస్తున్నట్లు మునీర్ చెబుతున్నారు. కానీ, అసలు నిజం ఏంటంటే.. గతంలో భారత్ జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’ సైనిక దాడిని తిప్పికొట్టడంలో మునీర్ దారుణంగా విఫలమయ్యారు. తాలిబాన్‌తో దౌత్య సంబంధాలు కూడా పూర్తిగా దెబ్బతినడంతో పరువు కాపాడుకునేందుకు ఆయన అంతర్గతంగా ఈ డ్రామాలు ఆడుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అధికారం కోసం మునీర్ ఆడుతున్న ఈ ఆట.. ఇప్పటికే తీవ్ర అశాంతితో రగులుతున్న సింధ్, బలూచిస్థాన్, ఖైబర్ పంఖ్తుంక్వా ప్రాంతాలను మరింత నెత్తురోడించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థానిక వనరులను దోచుకుని ఇస్లామాబాద్, రావల్పిండి నగరాలకు తరలిస్తున్నారంటూ అక్కడి ప్రజలు సైన్యంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చైనా-పాక్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టుపై కూడా దాడులు జరుగుతున్న తరుణంలో పోలీసులను సైన్యం కిందకు తెస్తే తిరుగుబాటు మరింత తీవ్రమై పాక్ పతనానికి దారితీస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.