శివరాజ్ సింగ్ చౌహాన్ తో రేవంత్ రెడ్డి భేటీ.. 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని విన్నపం

Revanth Reddy meets Shivraj Singh Chouhan requests allocation of 1156 lakh houses
  • గత ప్రభుత్వ హయాంలో గృహనిర్మాణ రంగం నిర్లక్ష్యానికి గురైందని కేంద్ర మంత్రికి తెలిపిన రేవంత్
  • ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఉపాధి హామీ జాబితాలో చేర్చాలని విన్నపం
  • గ్రామీణ కుటుంబాలను ఆదుకునేందుకు ఉపాధి హామీ పథకాన్ని విస్తరించాలన్న సీఎం

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన పలు కీలక గ్రామీణాభివృద్ధి అంశాలు, గృహ నిర్మాణం, ఉపాధి హామీ పథకాల విస్తరణపై సుదీర్ఘంగా చర్చించారు.


గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గ్రామీణ గృహనిర్మాణ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి రేవంత్ వివరించారు. ఈసారి నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ‘ప్రధాని ఆవాస్ యోజన - గ్రామీణ్’ (PMAY-G) 2.0 కింద తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని కోరారు. అదే సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఉపాధి హామీ (VB-G RAM-G) జాబితాలో చేర్చి, దానిద్వారా లబ్ధిదారులకు 90 రోజుల పాటు పని కల్పించి ఆర్థిక భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


మరోవైపు, ఎల్‌నినో ప్రతికూల పరిస్థితుల వల్ల దెబ్బతింటున్న గ్రామీణ కుటుంబాలను, రైతులను ఆదుకునేందుకు ఉపాధి హామీ పథకం పరిధిని విస్తరించాలని రేవంత్ రెడ్డి కోరారు. కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్ల పెంపకం, మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపక షెడ్ల నిర్మాణాలతో పాటు భూముల అభివృద్ధి, నీటి సంరక్షణ పనులను ఈ పథకం కింద అనుమతించాలని కోరారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న వ్యవసాయ భూముల పునరుద్ధరణ పనులను కూడా ఇందులో చేర్చి, రైతాంగానికి, గ్రామీణ ఉపాధి రంగానికి కేంద్రం తగిన సహాయసహకారాలు అందించాలని విన్నవించారు.

Advertisement
Revanth Reddy
Shivraj Singh Chouhan
Telangana Housing Scheme
PMAY Gramin
MGNREGA Telangana
Indiramma Indlu

More Telugu News