సైబర్ మోసాలకు పాల్పడితే మరణశిక్ష.. మయన్మార్‌లో కొత్త చట్టం

Death penalty for cyber fraud new law in Myanmar
  • ఆన్‌లైన్ మోసాలపై మయన్మార్‌లో కఠిన చట్టం
  • బలవంతపు స్కామ్‌లకు పాల్పడితే ఇకపై మరణశిక్ష
  • స్కామ్ సెంటర్ల నిర్వాహకులకు యావజ్జీవ కారాగార శిక్ష
  • యాంటీ ఆన్‌లైన్ స్కామ్ బిల్లుకు మయన్మార్ పార్లమెంట్ ఆమోదం
ఆన్‌లైన్ మోసాలను (సైబర్ స్కామ్స్) అరికట్టే దిశగా మయన్మార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలను బలవంతంగా హింసించి, ఆన్‌లైన్ మోసాలకు పాల్పడేలా చేస్తున్న నేరగాళ్లకు మరణశిక్ష విధించేలా రూపొందించిన కొత్త చట్టానికి ఆమోదం తెలిపింది. రాజధాని నైప్యిడాలో జరిగిన పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో 'యాంటీ-ఆన్‌లైన్ స్కామ్ బిల్లు'కు ఆమోదం లభించినట్లు స్పీకర్ ప్రకటించారు.

ఈ నూతన చట్టం ప్రకారం, ఉద్యోగాల పేరుతో ప్రజలను కిడ్నాప్ చేసి, వేధింపులకు గురిచేస్తూ బలవంతంగా ఆన్‌లైన్ నేరాలకు పాల్పడేలా చేసే వారికి 10 ఏళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ క్రమంలో బాధితులు ఎవరైనా మరణిస్తే, బాధ్యులైన నిందితులకు మరణశిక్ష విధించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. వీటితో పాటు స్కామ్ సెంటర్ల నిర్వాహకులకు, డిజిటల్ లేదా క్రిప్టోకరెన్సీ మోసాలకు పాల్పడే వారికి గరిష్ఠంగా యావజ్జీవ కారాగార శిక్ష పడేలా కఠిన నిబంధనలను పొందుపరిచారు.

మయన్మార్‌లో నెలకొన్న అంతర్గత ఘర్షణలను ఆసరాగా చేసుకుని సైబర్ నేర కేంద్రాలు పుట్టగొడుగుల్లా విస్తరించాయి. ఆగ్నేయాసియా అంతటా విస్తరించిన ఈ నెట్‌వర్క్, పెట్టుబడులు, హానీ ట్రాప్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతోంది. కొందరు స్వచ్ఛందంగానే ఈ ముఠాలలో చేరుతుండగా, మెజారిటీ విదేశీయులను ఆకర్షణీయమైన ఉద్యోగాల పేరుతో అక్రమంగా తరలించి, వారిని బందీలుగా మార్చి బలవంతంగా ఈ అరాచకాలకు ఒడిగడుతున్నారు.

ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది యువత ఉద్యోగాల వేటలో మయన్మార్ వెళ్లి, అక్కడ స్కామ్ కేంద్రాల్లో బందీలుగా చిక్కుకున్నట్లు అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో, సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు ప్రస్తుత సైనిక మద్దతుగల ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కఠిన చట్టం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Advertisement
Myanmar
Anti Online Scam Bill
Cyber Fraud Death Penalty
Online Scam Laws
Cryptocurrency Fraud Punishment

More Telugu News