ముద్రగడ నా బంధువు... రాజకీయాల కోసం వెళ్లలేదు: జ్యోతుల నెహ్రూ
- జగన్ ట్రాప్‌లలో కొందరు కూటమి నేతలు పడుతున్నారన్న జ్యోతుల నెహ్రూ
- వ్యక్తిగత అనుబంధంతోనే ముద్రగడ సంతాప సభకు వెళ్లానని వెల్లడి
- రాష్ట్రాభివృద్ధిని కోరుకునే ప్రభుత్వాలకే కాపులు అండగా నిలుస్తారన్న నెహ్రూ
వైసీపీ అధినేత జగన్ వేస్తున్న రాజకీయ ట్రాప్‌లలో తమ కూటమికి చెందిన కొందరు నేతలు అనవసరంగా పడిపోతున్నారని, అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు. తాటీపాకలో జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరుకావడంపై వస్తున్న విమర్శలకు జ్యోతుల నెహ్రూ గట్టి కౌంటర్ ఇచ్చారు. "ముద్రగడ నాకు వరుసకు బంధువు, పైగా మా నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత. ఆ వ్యక్తిగత అనుబంధంతోనే నేను అక్కడికి వెళ్లాను తప్ప, ఎవరినీ బ్లాక్‌మెయిల్ చేయడానికో లేదా రాజకీయం చేయడానికో కాదు. దీనిపై జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు" అని స్పష్టం చేశారు.
అలాగే, 2019లో టీడీపీ ఓటమికి కాపు ఉద్యమమే కారణమంటూ తమ పార్టీ సీనియర్ నేత బొండా ఉమా చేసిన వ్యాఖ్యలను నెహ్రూ తీవ్రంగా తప్పుబట్టారు. "ఒక్క ఘటనను మాత్రమే పట్టుకుని ఒక పెద్ద సామాజిక వర్గానికి, పార్టీ ఓటమికి ముడిపెట్టడం సరికాదు. కాపులు ఎప్పుడూ రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వాలకే అండగా నిలుస్తారు. మెజారిటీ కాపు సామాజికవర్గం ఎటు ఉంటే ఆ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది" అని విశ్లేషించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కాపుల సంక్షేమానికి, వికాసానికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందన్న జ్యోతుల నెహ్రూ... ప్రభుత్వం తరఫున కాపు సామాజిక వర్గానికి చేయాల్సిన ప్రతి మేలునూ ముందుండి నడిపిస్తామని నొక్కి చెప్పారు.