విద్యార్థులు రోడ్డెక్కితే.. ప్రధాని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తున్నారు: లోక్‌సభలో గౌరవ్ గొగోయ్ ధ్వజం
- యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో చర్చ
- 2024లో కఠిన చట్టం తీసుకొచ్చినప్పటికీ పేపర్ లీకేజీలు ఎలా జరుగుతున్నాయన్న గొగోయ్
- విద్యార్థులపై లాఠీఛార్జ్ కు ఎవరు ఆదేశాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్
యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓవైపు ప్రశ్నాపత్రాల లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే... ప్రధాని మోదీ మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసుకోవడంలో మునిగిపోయారని ఎద్దేవా చేశారు.
ఇప్పటికే 2024లో కఠిన చట్టం తీసుకొచ్చినప్పటికీ పదే పదే పేపర్ లీకేజీలు ఎలా జరుగుతున్నాయని గొగోయ్ ప్రశ్నించారు. ఇప్పుడు తెస్తున్న సవరణలు కూడా ఎలాంటి పెద్ద మార్పును తేలేవని విమర్శించారు. 2024 నీట్ పేపర్ లీకేజీ సమయంలో కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారని... అప్పుడు కూడా కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకు మంత్రి తీవ్రంగా యత్నించారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని అమానుష చర్యగా అభివర్ణించిన ఆయన, విద్యార్థులపై దాడికి ఎవరు ఆదేశాలిచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అదే సమయంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ ఇమేజ్ ను కాపాడేందుకే ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రి పదవి నుంచి తప్పించారని ఆరోపించారు. వీధుల్లో పోరాడి ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేసిన యువతను ఆయన అభినందించారు. కాగా, ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్ బలంగా తిప్పికొట్టారు. 2014కు ముందు యూపీఏ పాలనలో ఏకంగా 22 సార్లు పేపర్ లీకేజీలు జరిగాయంటూ ప్రతిపక్షాల తీరును తప్పుబట్టారు.