భారత పర్యాటకురాలికి గట్టి షాక్ ఇచ్చిన స్విట్జర్లాండ్.. ట్రిప్ ముగిసిన ఏడాదికి రూ.1.5 లక్షల ట్రాఫిక్ చలాన్‌!

Indian Tourist Receives Shocking Traffic Fine in Switzerland
  • స్విట్జర్లాండ్ వెళ్లి వచ్చిన ఏడాదికి భారత మహిళకు భారీ జరిమానా
  • దాదాపు రూ.1.5 లక్షల ట్రాఫిక్ ఫైన్‌తో వచ్చిన లేఖ
  • ఫైన్ చెల్లించకపోతే వీసాపై ప్రభావం పడుతుందని హెచ్చరికలు
  • దీన్ని ఎలా ఎదుర్కోవాలో సలహా కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్
  • నెట్టింట వైరల్ కావడంతో విదేశీ ప్రయాణాలపై విస్తృత చర్చ
విదేశీ ప్రయాణాలు ఎన్నో మధురానుభూతులను మిగిలిస్తాయి. కానీ, కొన్నిసార్లు ఊహించని షాక్‌లు కూడా ఇస్తాయి. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఓ భారతీయ మహిళకు ఎదురైంది. స్విట్జర్లాండ్ వెళ్లి వచ్చిన దాదాపు ఏడాది తర్వాత ఆమెకు రూ.1.5 లక్షల ట్రాఫిక్ జరిమానా విధిస్తున్నట్లు ఓ లేఖ అందింది. ఈ ఊహించని పరిణామంతో ఆమె బిత్తరపోయారు.

వివరాల్లోకి వెళితే.. ‘పోన్ సప్డీ’ అనే పేరుతో 'ఎక్స్' ఖాతా ఉన్న సదరు మహిళ, ఈ షాకింగ్ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. "స్విట్జర్లాండ్ వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన నెలల తర్వాత మీలో ఎవరికైనా ట్రాఫిక్ ఫైన్ వచ్చిందా? మా ట్రిప్ ముగిసిన దాదాపు ఏడాదికి రూ.1.5 లక్షల చలాన్ వచ్చింది. దీనిపై అప్పీల్ చేసుకునే, తగ్గించుకునే లేదా మాఫీ చేయించుకునే అవకాశం ఉందేమో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం. ఈ విషయంలో ఎవరికైనా అనుభవం ఉంటే దయచేసి సలహా ఇవ్వండి" అని ఆమె పోస్ట్ చేశారు.

ఆమె పోస్ట్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి 1.3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ఘటనతో విదేశాల్లో కారు అద్దెకు తీసుకునేటప్పుడు, స్థానిక ట్రాఫిక్ నిబంధనల విషయంలో భారత ప్రయాణికులు ఎంత జాగ్రత్తగా ఉండాలనే దానిపై నెట్టింట విస్తృత చర్చ మొదలైంది. విదేశాల్లోని రెంటల్ కంపెనీలు, ట్రాఫిక్ ఉల్లంఘనల జరిమానాలను కస్టమర్లకు పంపి, దానిపై అడ్మిన్ ఫీజు కూడా వసూలు చేస్తాయని పలువురు గుర్తుచేశారు.

చాలా మంది నెటిజన్లు స్విస్ జరిమానాల విషయంలో నిర్లక్ష్యం వద్దని సూచించారు. "ఫైన్ చెల్లించకపోతే తదుపరి షెంజెన్ వీసా పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయని, జరిమానా మొత్తంపై వడ్డీ కూడా పెరిగే అవకాశం ఉందని" హెచ్చరించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. "మేము కచ్చితంగా ఫైన్ చెల్లిస్తాం. కానీ, మాకు సమాచారం చాలా ఆలస్యంగా అందింది కాబట్టి, ఆలస్య రుసుముపై అభ్యంతరం చెప్పాలనుకుంటున్నాం" అని స్పష్టం చేశారు.

మొత్తం మీద ఈ సంఘటన విదేశాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తోంది. చిన్న పొరపాటు కూడా ఎంత పెద్ద ఆర్థిక భారానికి దారితీస్తుందో ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.
Go Back to Shorts
Indian Tourist
Switzerland
Traffic Fine
Pon Sapdi
Swiss Traffic Rules
International Travel
Schengen Visa
Rental Car
Traffic Violation
Travel Fine

More Telugu News