హైదరాబాద్, దాని శివారు ప్రాంతాల్లో అక్రమంగా భూగర్భ జలాలను తోడేస్తూ సాగిస్తున్న నీటి వ్యాపారంపై హైడ్రా (HYDRAA) ఉక్కుపాదం మోపుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా బోర్లు వేసి, నీటిని ట్యాంకర్ల ద్వారా అమ్ముకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం భారీ ఆపరేషన్ చేపట్టింది.

ఈ ఆపరేషన్‌లో భాగంగా తెల్లాపూర్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో 7 అక్రమ బోర్‌వెల్‌లను పైపులతో సహా తొలగించి, వాటిని పూర్తిగా పూడ్చివేసింది. అలాగే, నీటి నిల్వ కోసం నిర్మించిన 6 భారీ వాటర్ సంపులను కూడా అధికారులు ధ్వంసం చేశారు. నీటి రవాణాకు ఉపయోగిస్తున్న ట్యాంకర్లను సీజ్ చేసి, సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేశారు.

భూగర్భ జలాలు అడుగంటిపోకుండా కాపాడటంతో పాటు, స్థానిక ప్రజలకు నీటి కొరత ఏర్పడకుండా చూసేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా నీటి ట్యాంకర్లు అతివేగంగా, నిర్లక్ష్యంగా ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని, తమ ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని పలు కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల వాసులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో హైడ్రా ఈ చర్యలకు ఉపక్రమించింది.

హైడ్రా తీసుకుంటున్న చర్యలతో తమకు ప్రాణభయం తప్పిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చెరువులు, కుంటల సమీపంలో జరుగుతున్న అక్రమ నీటి దందాను పూర్తిగా అరికట్టాలని వారు కోరుతున్నారు. అనుమతులు లేని బోర్లపై నిఘా కొనసాగిస్తామని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.