ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ మోసం.. రియల్ ఎస్టేట్ కుదేలైంది: రాంచందర్‌ రావు

Ramchander Rao Slams Congress Over Indiramma Houses
  • తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్న రాంచందర్ రావు
  • హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు ముక్కలు చేశారని మండిపాటు
  • కాంగ్రెస్ ప్రభుత్వానికి మజ్లిస్ పార్టీయే ముఖ్యమని వ్యాఖ్య

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు. గత కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేయగా, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తూ పేదలకు తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.


ఎంఐఎం ఒత్తిడికి లొంగి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు ముక్కలు చేశారని దుయ్యబట్టారు. నగరంలో డివిజన్ల ఏర్పాటుపై అధికారులకే క్లారిటీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మజ్లిస్ పార్టీయే ముఖ్యమని, నగర ప్రజలు కాదని విమర్శించారు. భాగ్యనగరంలో తాగునీటి ఎద్దడి, కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, చిన్న వాన పడితేనే నగరం మునిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.


గత బీఆర్ఎస్ పాలనలో నేతలు రియల్ ఎస్టేట్ పేరుతో జేబులు నింపుకోగా, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఆ రంగం పూర్తిగా కుదేలైందని రామచందర్‌ రావు ఆరోపించారు. హైదరాబాద్‌ను నిజమైన విశ్వనగరంగా మార్చడం, అవినీతి రహిత పాలన అందించడం ఒక్క బీజేపీకే సాధ్యమని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పి, బీజేపీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.


Go Back to Shorts
Ramchander Rao
Telangana
Congress
BJP
Indiramma Houses
Real Estate
Hyderabad
BRS
Municipal Elections
Revanth Reddy

More Telugu News