ప్రపంచ మామిడి రాజధాని.. ఏ పట్టణాన్ని అంటారో తెలుసా?

Malihabad Uttar Pradesh The World Capital of Mangoes
  • మలిహాబాద్‌ను ‘ప్రపంచ మామిడి రాజధాని’గా పిలుస్తారు
  • నవాబుల నాటి సుదీర్ఘ మామిడి సాగు చరిత్ర దీని సొంతం
  • ఇక్కడి ‘దశేరి’ రకం మామిడి పండ్లకు ప్రపంచ గుర్తింపు
  • 200 ఏళ్లకు పైబడిన దశేరి ‘మదర్ ట్రీ’ ఇప్పటికీ ఉంది
  • ఇక్కడి నుంచి దేశవిదేశాలకు భారీగా మామిడి ఎగుమతులు
వేసవి వచ్చిందంటే చాలు.. నోరూరించే మామిడి పండ్ల కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తుంటారు. పండ్లలో రాజుగా పిలిచే మామిడికి మన దేశంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఈ పండు సాగవుతున్నప్పటికీ, భారత్‌లోని ఓ చిన్న పట్టణం మాత్రం తన శతాబ్దాల చరిత్రతో అద్భుతమైన తోటలతో ‘ప్రపంచ మామిడి రాజధాని’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అదే ఉత్తరప్రదేశ్‌లోని మలిహాబాద్.

నవాబుల నాటి వారసత్వం
లక్నోకు సమీపంలో ఉండే మలిహాబాద్ పట్టణానికి మామిడి సాగులో ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. నవాబుల కాలం నుంచే ఇక్కడ మామిడి తోటల పెంపకం ఒక సంప్రదాయంగా సాగుతోంది. ఇక్కడి సారవంతమైన నేలలు, అనుకూలమైన వాతావరణం వల్ల అత్యంత నాణ్యమైన, రుచికరమైన మామిడి పండ్లు ఇక్కడ పండుతాయి. మలిహాబాద్‌లో పండే మామిడికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ భారీ డిమాండ్ ఉంది.

మలిహాబాద్ స్పెషాలిటీ ఏంటి?
మలిహాబాద్ మామిడి పండ్లు అనగానే గుర్తొచ్చేది వాటి తియ్యదనం, అద్భుతమైన సువాసన, పీచు లేని మెత్తటి గుజ్జు. ఇక్కడ ఎన్నో రకాల మామిడి పండ్లు పండుతున్నప్పటికీ అన్నింటికంటే ‘దశేరి’ రకం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈ రకానికి చెందిన సుమారు 200 ఏళ్ల నాటి ‘మదర్ ట్రీ’ ఇప్పటికీ ఈ ప్రాంతంలో సజీవంగా ఉండటం విశేషం.

ప్రసిద్ధ మామిడి రకాలు

  • దశేరి: ఇక్కడి సిగ్నేచర్ రకం. అద్భుతమైన తీపి, సువాసనకు ఇది పెట్టింది పేరు.
  • లంగ్డా: పండిన తర్వాత కూడా పైతోలు పచ్చగానే ఉంటుంది. కొద్దిగా పులుపు కలిసిన తీపి రుచితో ఉంటుంది.
  • చౌసా: ఎక్కువ రసం, నోరూరించే తియ్యదనంతో ఉండే సాఫ్ట్ వెరైటీ.
  • సఫేదా: పెద్ద సైజులో ఉంటూ, తక్కువ తీపి, క్రీమీ గుజ్జుతో ఉంటుంది.
  • ఆమ్రపాలి: ముదురు నారింజ రంగు గుజ్జుతో, మంచి ఫ్లేవర్‌తో ఉండే హైబ్రిడ్ రకం.

సంస్కృతిలో భాగం
మలిహాబాద్ ప్రజలకు మామిడి కేవలం ఒక పంట మాత్రమే కాదు. అది వారి జీవన విధానం. గుర్తింపు. తరతరాలుగా ఇక్కడి రైతులు ఈ తోటలను ప్రాణప్రదంగా కాపాడుకుంటూ వస్తున్నారు. వేసవి వచ్చిందంటే చాలు.. ఇక్కడి మార్కెట్లన్నీ మామిడి పండ్లతో, వ్యాపారులతో కిటకిటలాడుతుంటాయి. గాల్లో సైతం మామిడి పండ్ల సువాసనలే గుబాళిస్తాయి. థాయిలాండ్, మెక్సికో, పాకిస్థాన్‌ వంటి దేశాలు మామిడి ఉత్పత్తిలో పోటీ పడుతున్నప్పటికీ.. మలిహాబాద్ తన సుదీర్ఘ వారసత్వంతో ప్రపంచ మామిడి ప్రియుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది.
Go Back to Shorts
Malihabad
Mangoes
Lucknow
Dasheri mango
Mango cultivation
Uttar Pradesh
Indian mangoes
Mango varieties
Mango farming
World mango capital

More Telugu News