నెలకు రూ.15 వేల నుంచి ఏడాదికి రూ.33 లక్షల ప్యాకేజీ.. అంకుర్ వారికూ సక్సెస్ స్టోరీ!

Ankur Warikoo Success Story From 15K to 33 Lakhs Package
  • అమెరికాలో చదువు ఆపేసి ఇండియాకు రిటర్న్
  • రూ.15 వేల జీతంతో కెరీర్ ప్రారంభం
  • భారీ లోన్ తీసుకుని ఐఎస్‌బీలో ఎంబీఏ
  • ఐదేళ్లలోనే రూ.33 లక్షల ప్యాకేజీ సొంతం
  • కష్టపడితేనే విజయం లభిస్తుందని యువతకు సందేశం
జీవితంలో ఒక దశలో దారి తెలియక అయోమయంలో పడిపోయిన ఆ యువకుడు.. కేవలం ఐదేళ్లలోనే ఊహించని స్థాయికి ఎదిగాడు. నెలకు కేవలం రూ.14,750 సంపాదనతో కెరీర్ ప్రారంభించి ఏడాదికి రూ.33 లక్షల ప్యాకేజీ అందుకునే స్థాయికి చేరిన తన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

అమెరికా నుంచి ఖాళీ చేతులతో
అంకుర్ వారికూ 24 ఏళ్ల వయసులో అమెరికాలో తన పీహెచ్‌డీ చదువును మధ్యలోనే ఆపేసి తీవ్ర అయోమయ స్థితిలో ఇండియాకు తిరిగొచ్చారు. దాదాపు 45 రోజుల పాటు వార్తాపత్రికల్లో ప్రకటనలు చూస్తూ ఇంటర్వ్యూలకు తిరిగిన తర్వాత ‘ఎన్ఐఎస్ స్పార్టా’ అనే సంస్థలో ఉద్యోగం సంపాదించారు. నెలకు కనీసం రూ.10,000 వస్తే చాలనుకున్న అతడికి ఆ సంస్థ రూ.15,000 జీతం ఆఫర్ చేసింది. అయితే అక్కడ ఎంబీఏ చదివిన సహోద్యోగుల మధ్య తక్కువ అర్హత ఉన్నట్లు ఫీల్ అయిన అంకుర్ తానూ ఎంబీఏ చేయాలని నిర్ణయించుకున్నారు.

రిస్క్ చేసి భారీ లోన్
అదే సమయంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బినెస్ తమ ఏడాది ఎంబీఏ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. కానీ ఆ కోర్సు ఫీజు కోసం వాళ్ల కుటుంబంలో ఎప్పుడూ తీసుకోలేనంత పెద్ద మొత్తాన్ని ఎడ్యుకేషన్ లోన్‌గా తీసుకోవాల్సి వచ్చింది. దానికి నెలకు రూ.20,000 ఈఎంఐ కట్టాలి. అప్పుడు అంకుర్ తనను తాను ఒక ప్రశ్న వేసుకున్నారు. ‘‘ఐఎస్‌బీ పూర్తి చేశాక నాకు కనీసం రూ.35,000 (ప్రస్తుత జీతం రూ.15,000 + ఈఎంఐ రూ.20,000) వచ్చే ఉద్యోగం దొరుకుతుందా?’’ అని ఆలోచించి కచ్చితంగా వస్తుందనే నమ్మకంతో ఆ రిస్క్ తీసుకున్నారు.

కన్సల్టింగ్ వైపు అడుగులు
ఐఎస్‌బీలో ఐఐటీ టాపర్లు, సీఏ ర్యాంకర్లు, డాక్టర్లు, డిఫెన్స్ నిపుణుల మధ్య చేరిన అంకుర్.. వారి నుంచి విషయాలను నేర్చుకోవడంపైనే దృష్టి పెట్టారు. అక్కడ కన్సల్టింగ్ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుని ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యారు. ప్రారంభంలో బీసీజీ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా మేనేజింగ్ డైరెక్టర్‌తో జరిగిన చివరి రౌండ్ ఇంటర్వ్యూ తర్వాత క్యాంపస్‌లోనే అత్యుత్తమ ఉద్యోగం ‘ఏటీ కెర్నీ’ సంస్థలో ఏడాదికి రూ.12 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించారు.

కష్టపడే తత్వమే
ఆ సంస్థలో చేరిన కేవలం ఏడాదిన్నర కాలంలోనే వేగంగా ప్రమోషన్ అందుకుని ఏడాదికి రూ.33 లక్షల ప్యాకేజీ స్థాయికి చేరారు. ఈ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘‘నేనేమీ అందరికంటే మహా తెలివైనవాడిని కాదు. కానీ ఎవరైనా నన్ను నమ్మినప్పుడు, ఆ నమ్మకానికి అర్హుడిగా నిలవడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డాను’’ అని అంకుర్ పేర్కొన్నారు. అవకాశాలు ఇతరుల ద్వారా రావచ్చని, కానీ ఆ తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకుంటామనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుందని యువతకు సందేశమిచ్చారు.
Go Back to Shorts
Ankur Warikoo
success story
motivational story
career growth
ISB
education loan
AT Kearney
consulting
salary package
business

More Telugu News