గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పటికీ వైరల్ అవుతోంది. కాలేజీ రోజుల్లో జరిగిన ఓ సరదా సంఘటనను ఆయన ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుతున్నప్పుడు, తెలియక వాడిన ఒకే ఒక్క మాటతో క్యాంపస్‌లో ఒక్కరోజులోనే తాను ఎలా పాపులర్ అయ్యారో వివరించారు.

చెన్నై నుంచి ఐఐటీ ఖరగ్‌పూర్‌కు కొత్తగా వచ్చిన ఆయనకు, హిందీ మాట్లాడటంలో పెద్దగా అనుభవం లేదు. ఇతరులు మాట్లాడటం చూసి, తాను కూడా అలాగే ఒకరిని పిలవాలనుకున్నారు. ఆ క్రమంలో, ఒక వ్యక్తిని పిలిచేందుకు "అబే సాలే" అని గట్టిగా అరిచారు.

అయితే, అది చాలా అసభ్యకరమైన పదం అని తెలియకపోవడంతో ఆయన ఇబ్బందిలో పడ్డారు. ఆ మాటకు మెస్ సిబ్బంది తీవ్రంగా ఆగ్రహించి, నిరసనగా మెస్‌ను తాత్కాలికంగా మూసివేశారు. "ఆ ఘటనతో ఆ రోజు నేను క్యాంపస్‌లో చాలా పాపులర్ అయ్యాను" అని సుందర్ పిచాయ్ నవ్వుతూ చెప్పారు.