బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో కొనసాగడం దేశానికే అవమానం: కేటీఆర్
- పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు అరెస్ట్
- ఈ నేపథ్యంలోనే కేటీఆర్ విమర్శలు
- నిందితుణ్ని 9 రోజులు కేంద్ర మంత్రే దాచారని ఆరోపణ
- బాధిత కుటుంబాన్ని బెదిరించారన్న కేటీఆర్
రాష్ట్రంలో ఒక బాలికకు తీవ్ర అన్యాయం జరిగితే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా మిన్నకుండిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి బాధితురాలికి అన్యాయం చేయాలని చూశాయని విమర్శించారు. కానీ ఆ బాలికకు న్యాయం జరిగేలా బీఆర్‌ఎస్ పార్టీ మాత్రమే పోరాడిందని తెలిపారు. గత రెండున్నరేళ్లుగా తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని ఆరోపించారు. ప్రధాని మోదీ చెబుతున్న ‘బేటీ పడావో.. బేటీ బచావో’ నినాదం కేవలం మాటలకే పరిమితమైందని విమర్శించారు.
దేశ చరిత్రలో బహుశా మొదటిసారి ఓ కేంద్రమంత్రి కుమారుడిపై లుకౌట్ సర్క్యులర్ ఇచ్చే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ అన్నారు. బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి తొలగించకపోతే ఈ కేసులో విచారణ సరిగా జరగదని అనుమానం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వ్యక్తిని దాదాపు 9 రోజుల పాటు దాచిపెట్టింది కేంద్రమంత్రేనని ఆరోపించారు. బాధితురాలి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేసి కేసును నీరుగార్చాలని చూశారన్నారు. ఇలాంటి వ్యక్తులు ఉన్నతమైన పదవుల్లో కొనసాగడం తెలంగాణ రాష్ట్రానికే గాక దేశానికే అవమానమని మండిపడ్డారు.