భారత్‌కు తిరిగి వస్తున్న చోళుల కాలం నాటి రాగి ఫలకాలు.."ఇది ప్రతి భారతీయుడికి ఆనంద క్షణం":మోదీ

Narendra Modi says Chola era copper plates returning to India is joyous moment
  • 11వ శతాబ్ది నాటి చోళుల రాగి ఫలకాలు భారత్‌కు రాక
  •  నెదర్లాండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ 
  •  రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడి కాలం నాటివిగా గుర్తింపు
  •  ఇది ప్రతి భారతీయుడికి ఆనంద క్షణమన్న ప్రధాని మోదీ 
  •  1862 నుంచి లైడెన్ యూనివర్సిటీ వద్ద ఉన్న ఫలకాలు
భారత చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. 11వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి అమూల్యమైన రాగి ఫలకాలు నెదర్లాండ్స్ నుంచి తిరిగి స్వదేశానికి రానున్నాయి. నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో నిన్న జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫలకాలను భారత్‌కు అప్పగించారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, డచ్ ప్రధాని రాబ్ జెట్టెన్ హాజరయ్యారు.

ఈ రాగి ఫలకాల సెట్‌లో 21 పెద్దవి, 3 చిన్న ఫలకాలు ఉన్నాయి. వీటిపై సంస్కృతం, తమిళ భాషల్లో శాసనాలు ఉన్నాయి. తన తండ్రి రాజరాజ చోళుడు ఇచ్చిన వాగ్దానాన్ని కుమారుడైన రాజేంద్ర చోళుడు అధికారికంగా నెరవేర్చిన చారిత్రక ఘట్టాన్ని ఇవి వివరిస్తాయి. నాగపట్నంలోని బౌద్ధ విహారానికి అనైమంగళం గ్రామ ఆదాయాన్ని కేటాయించినట్లు ఈ ఫలకాలలో పొందుపరిచారు. చోళుల వైభవాన్ని, పరిపాలనా దక్షతను ఈ శాసనాలు తెలియజేస్తాయి.

దాదాపు 1862 నుంచి ఈ ఫలకాలు నెదర్లాండ్స్‌లోని లైడెన్ యూనివర్సిటీ ఆధీనంలో ఉన్నాయి. వలస పాలన కాలంలో వీటిని అక్రమంగా తరలించారని నిర్ధారించిన డచ్ కమిటీ సిఫారసుల మేరకు, భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థనతో వీటిని తిరిగి అప్పగించడానికి నెదర్లాండ్స్ ప్రభుత్వం అంగీకరించింది.

ఈ పరిణామంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. "ఇది ప్రతి భారతీయుడికి ఆనంద క్షణం" అని పేర్కొన్నారు. చోళుల గొప్పతనాన్ని, వారి సంస్కృతిని, సముద్ర వాణిజ్య నైపుణ్యాన్ని భారత్ ఎంతో గర్వంగా స్మరించుకుంటుందని తెలిపారు. ఈ ఫలకాలను ఇన్నాళ్లు భద్రపరిచిన లైడెన్ యూనివర్సిటీకి, నెదర్లాండ్స్ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ఈ ఫలకాలను అధికారికంగా భారత్‌కు తరలించనున్నారు.
Go Back to Shorts
Narendra Modi
Chola dynasty
copper plates
Netherlands
India cultural heritage
Rajendra Chola I
Rajaraja Chola I
Leiden University
Nagapattinam
Anaimangalam

More Telugu News