దేశంలో నిరుద్యోగిత రేటు మళ్లీ పెరిగింది. 2026 ఏప్రిల్ నెలకు గాను భారత నిరుద్యోగిత రేటు ఆరు నెలల గరిష్ఠ స్థాయి అయిన 5.2 శాతానికి చేరింది. మార్చిలో ఇది 5.1 శాతంగా ఉంది. అయితే, ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 12 నెలల కనిష్ఠానికి తగ్గడం గమనార్హం. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్‌) నెలవారీ బులెటిన్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఈసారి నిరుద్యోగిత రేటు పెరుగుదలకు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలే కారణమయ్యాయి. గ్రామాల్లో నిరుద్యోగిత రేటు మార్చిలోని 4.3 శాతం నుంచి ఏప్రిల్‌లో 4.6 శాతానికి పెరిగింది. దీనికి భిన్నంగా, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 6.8 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గింది. ఇది ఏప్రిల్ 2025 తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి. పట్టణాల్లోని ఈ సానుకూలత ముఖ్యంగా మహిళల విషయంలో ఎక్కువగా కనిపించింది. పట్టణ మహిళల నిరుద్యోగిత రేటు మార్చిలోని 9.0 శాతం నుంచి ఏప్రిల్‌లో 8.5 శాతానికి తగ్గింది. ఇది కూడా ఏడాది కనిష్ఠం. అదేవిధంగా, పట్టణ పురుషుల నిరుద్యోగం 6.1 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గింది.

అయితే జాతీయ స్థాయిలో చూస్తే, మహిళలు ఇప్పటికీ ఉపాధి మార్కెట్లో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా మహిళల నిరుద్యోగిత రేటు మార్చిలోని 5.3 శాతం నుంచి ఏప్రిల్‌లో 5.4 శాతానికి పెరిగింది. పురుషుల నిరుద్యోగిత రేటు కూడా 5.0 శాతం నుంచి 5.1 శాతానికి స్వల్పంగా పెరిగింది.

నిరుద్యోగం పెరగడంతో పాటు, కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్‌పీఆర్‌) కూడా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. 15 ఏళ్లు పైబడిన వారిలో ఎల్ఎఫ్‌పీఆర్‌ మార్చిలో 55.4 శాతంగా ఉండగా, ఏప్రిల్‌లో 55.0 శాతానికి పడిపోయింది. అలాగే, శ్రామిక జనాభా నిష్పత్తి (డ‌బ్ల్యూపీఆర్‌) కూడా 52.6 శాతం నుంచి 52.2 శాతానికి క్షీణించింది. ముఖ్యంగా మహిళల కార్మిక భాగస్వామ్య రేటు ఎనిమిది నెలల కనిష్ఠ స్థాయి అయిన 33.9 శాతానికి పడిపోయింది. ఈ గణాంకాలు పట్టణాల్లో ఆర్థిక కార్యకలాపాలు మెరుగ్గా ఉన్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ ఉపాధి కల్పనలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని స్పష్టం చేస్తున్నాయి.