హైదరాబాద్‌లో బాలుడిపై వీధికుక్కల దాడి.. పరిస్థితి విషమం

Hyderabad Boy Aadvik Severely Injured in Street Dog Attack
  • ఆడుకుంటుండగా విరుచుకుపడిన 10 శునకాలు
  • తలకు తీవ్ర గాయాలు, విషమంగా బాలుడి పరిస్థితి
  • అధికారులు పట్టించుకోవడం లేదంటున్న స్థానికులు
హైదరాబాద్ నగరంలో వీధికుక్కలు మరోసారి బీభత్సం సృష్టించాయి. ఇంటి బయట ఆడుకుంటున్న ఓ చిన్నారిపై సుమారు 10 వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ప్రస్తుతం బాలుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ దారుణ ఘటన బీఎన్‌ రెడ్డి నగర్ సమీపంలోని టీచర్స్ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... సిద్దిపేటకు చెందిన ఆద్విక్ అనే బాలుడు వేసవి సెలవుల కోసం టీచర్స్ కాలనీలో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చాడు. సోమవారం ఇంటి సెల్లార్‌లో ఆడుకుంటుండగా, ఒక్కసారిగా 10 వీధికుక్కలు అతడిపై విరుచుకుపడ్డాయి. బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి పరుగెత్తుకొచ్చి కుక్కలను తరిమికొట్టారు.

అయితే, అప్పటికే కుక్కలు బాలుడి శరీరంపై తీవ్ర గాయాలు చేశాయి. ఈ దాడిలో బాలుడి తలపై చర్మం ఊడిపోయిందని, తీవ్ర రక్తస్రావం అయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కుటుంబసభ్యులు వెంటనే చిన్నారిని సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆద్విక్ పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిసింది. ఈ ఘటనతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వీధికుక్కల సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, వారి నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
Street Dogs
Dog Attack
Aadvik
BN Reddy Nagar
Teachers Colony
Kameni Hospital
Dog Menace
Child Safety
Telangana

More Telugu News