పోర్చుగల్‌లో నివసిస్తున్న ఒక భారతీయ వ్యాపారి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. స్థానిక పోర్చుగీస్ కార్మికులు చాలా ఖరీదైనవారని, అందుకే తాను కేవలం భారతీయులనే పనిలో పెట్టుకుంటానని ఆయన ఒక రోడ్ సైడ్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

ఆ ఇంటర్వ్యూలో, "మీరు భారతీయులను మాత్రమే నియమించుకుంటారా?" అని అడగ్గా, ఆయన "అవును" అని స్పష్టంగా సమాధానమిచ్చారు. పోర్చుగీస్ కార్మికులు ఎక్కువ జీతాలు అడుగుతారని, భాషా సమస్యల కారణంగా వారితో కమ్యూనికేట్ చేయడం కూడా కష్టమని వివరించారు. అయితే, పోర్చుగీస్ వారు సోమరులా అని ప్రశ్నించగా, "వారు సోమరులు కాదు, కేవలం ఖరీదైనవారు" అని బదులిచ్చారు.

తన నివాస ప్రాంతంలో భారతీయుల సంఖ్య పెరుగుతుండటంపై సంతోషం వ్యక్తం చేసిన ఆ వ్యాపారి, మరో ప్రశ్నకు ఇచ్చిన సమాధానం తీవ్ర విమర్శలకు దారితీసింది. "ఒకవేళ మీ సొంత నగరంలో పోర్చుగీస్ వారు అధిక సంఖ్యలో వచ్చి మెజారిటీగా మారితే మీకు ఇష్టమేనా?" అని ఇంటర్వ్యూయర్ అడగ్గా, "అలా జరగడం నాకు ఇష్టం ఉండదు" అని ఆయన బదులిచ్చారు.

ఈ వీడియోను ఇన్‌ఫ్లుయెన్సర్ మారియో నవ్ ఫాల్ షేర్ చేయడంతో ఇది మరింత వైరల్ అయింది. వ్యాపారి వైఖరిని నెటిజన్లు ద్వంద్వ ప్రమాణంగా, వివక్షాపూరితంగా అభివర్ణిస్తున్నారు. అమెరికా, యూకే, కెనడా వంటి దేశాల్లోనూ స్థానిక ఉద్యోగాల పరిరక్షణపై ఇలాంటి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.